హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియ భర్త భార్గవరామ్‌పై హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో తాజాగా ఓ కేసు నమోదైంది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఇప్పటికే ఆయనపై రెండు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ రెండు కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న భార్గవరామ్‌ను అరెస్ట్‌ చేసేందుకు ఏపీ పోలీసులు గచ్చిబౌలి వచ్చారు. ఈ క్రమంలోనే సోమవారం సాయంత్రం భార్గవరామ్ ఏపీ 21 సీకే 0222 నెంబర్ గల తన నల్లరంగు ఫార్చునర్‌ కారులో స్వయంగా నడుపుకుంటూ వెళ్తూ ఏపీ పోలీసుల కంటపడ్డారు. వెంటనే భార్గవరామ్‌ను ఆపి అరెస్ట్ చేద్దామని పోలీసులు ప్రయత్నించగా.. ఏపీ పోలీసుల రాకను గుర్తించిన భార్గవరామ్ కారు ఆపకుండా వేగంగా ముందుకు పోనిచ్చి తప్పించుకునే ప్రయత్నం చేశారు. 


అలా తమ నుంచి తప్పించుకుని పోతున్న భార్గవరామ్‌ను గచ్చిబౌలిలోని ఓక్ వుడ్ హోటల్ వద్ద ఆపేందుకు ప్రయత్నించగా, కారు ఆపినట్లే ఆపి మళ్లీ తప్పించుకున్నారు. దీంతో తమ విధులకు ఆటంకపరచడంతో పాటు కారుతో గుద్ది దాడి చేసే ప్రయత్నం చేశాడని భార్గవపై ఆళ్లగడ్డ ఎస్‌ఐ రమేశ్‌ కుమార్‌ గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆళ్లగడ్డ ఎస్సై రమేశ్ కుమార్ ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 353, 336 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు.. భార్గవరామ్‌ను అరెస్ట్ చేసే పనిలో నిమగ్నమయ్యారు.