ఏపీ అసెంబ్లీలో బీజేపీ vs టీడీపీ: సభలోనే టీడీపీకి సవాల్ విసిరిన బీజేపీ ఎమ్మెల్యే !
పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణంలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని విష్ణుకుమార్ రాజు చేసిన ఆరోపణలపై బుధవారం సభలో ఇరు పక్షాల మధ్య వాడీవేడిగా చర్చ జరిగింది.
తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులకు బీజేపీ శాసన సభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు అసెంబ్లీ వేదికగానే సవాల్ విసిరారు. టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే.. తామూ రాజీనామా చేయడానికి సిద్ధంగా వున్నామని విష్ణు కుమార్ రాజు టీడీపీ నేతలకు ఛాలెంజ్ చేశారు. పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణంలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని విష్ణుకుమార్ రాజు చేసిన ఆరోపణలపై బుధవారం సభలో ఇరు పక్షాల మధ్య వాడీవేడిగా చర్చ జరిగింది. విష్ణు కుమార్ రాజు చేసిన ఆరోపణలపై స్పందించిన భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు.. పట్టిసీమ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేందర్ రెడ్డి సైతం అనేక ఆరోపణలు చేసి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కానీ పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణంతోపాటు అనుకున్న పనిని, అనుకున్న దశకు పూర్తి చేసిన ఘనత చంద్రబాబు ప్రభుత్వం సొంతం అని వివరణ ఇచ్చారు. మంత్రి అచ్చెన్నాయుడు సైతం దీనిపై స్పందిస్తూ.. ఒకవేళ నిజంగానే పట్టిసీమ ప్రాజెక్టులో అవినీతి చోటుచేసుకున్నట్టయితే, అప్పుడు కనిపించని అవినీతి ఇప్పుడే ఎందుకు కనిపిస్తోంది అని ప్రశ్నించారు. రాజకీయంగా ఏపీ సర్కార్ పై బురదజల్లే ప్రయత్నంలో భాగమేనని అన్నారు.
ఏపీ మంత్రులు ఇచ్చిన వివరణపై స్పందించిన విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ.. కేవలం కాగ్ ఇచ్చిన నివేదిక ఆధారంగానే తాను మాట్లాడుతున్నానని, అంతకు మించి ఇంకెవ్వరిపై వ్యక్తిగత ఆరోపణలు చేయాల్సిన అవసరం తనకు లేదని అన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిన విషయం మొదట్లో తమకు తెలియదు. కాగ్ నివేదిక చూశాకే ఆ విషయం తెలిసొచ్చింది. ఆధారాలు లేకుండా ఆరోపించడం సరికాదు కనుక అప్పుడు ఏమీ అనలేదు కానీ ఇప్పుడు కాగ్ నివేదికే పట్టిసీమలో అవినీతిని వెల్లడిస్తోంది అని విష్ణుకుమార్ రాజు అభిప్రాయపడ్డారు.
పట్టిసీమలో అవినీతి గురించి మాట్లాడుతూ... క్యూబిక్ మీటర్ మట్టిని తీయడానికి రూ.21,350 ఖర్చు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పట్టిసీమకు రూ.190 కోట్లు వృథాగా ఖర్చు పెట్టారని, మరో రూ.371 కోట్లు దుర్వినియోగం చేశారని కాగ్ నివేదిక స్పష్టంచేస్తోందని, అలా ఎందుకు జరిగిందో తమరే ఆలోచించుకోవాల్సిన అవసరం వుందని విష్ణుకుమార్ రాజు అన్నారు. పట్టిసీమపై సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో దర్యాప్తు చేయిస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయని ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. అంతేకాకుండా మంత్రి దేవినేని ఉమ ఆరోపించినట్టుగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేందర్ రెడ్డితో తనకేం సంబంధం లేదని విష్ణుకుమార్ రాజు తేల్చిచెప్పారు.