ఏపీ రాజధాని తరలింపు వివాదంపై స్పందించిన బీజేపీ ఎంపీ జీవీఎల్
ఏపీ రాజధాని తరలింపుపై అటు టీడీపి, ఇటు వైసీపికి జీవీఎల్ చురకలు
అమరావతి: ఏపీ రాజధానిని అమరావతిని మరో చోటికి తరలించేందుకు కుట్ర జరుగుతోందనే ఆరోపణలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహా రావు స్పందిస్తూ.. రాజధానిని అమరావతిలో కొనసాగించే యోచన అధికార పార్టీకి లేదనిపిస్తోందన్నారు. రాజధానిని అమరావతిలో కొనసాగించకుంటే రాజధాని నిర్మాణం, అభివృద్ధి కోసం ఇక్కడ భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏంటి అని ఈ సందర్భంగా సర్కార్‌ను జీవిఎల్ నిలదీశారు. రాజధాని కోసమే తమ భూములను వదిలేసుకున్న రైతులను ప్రభుత్వం ఎలా ఆదుకుంటుందో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ జీవిఎల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా గత టీడీపి ప్రభుత్వంపైనా జీవిఎల్ విమర్శనాస్త్రాలు సంధించారు. రాజధాని తరలింపుపై ఇప్పుడు గగ్గోలు పెడుతున్న టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా భూములు ఇచ్చిన రైతుల కోసం చేసిందేమీ లేదని మండిపడ్డారు. రాజధాని నిర్మాణం కోసం అమరావతిలో అవసరానికి మించి భూసేకరణ చేశారని అప్పటి టీడీపి సర్కార్‌ని విమర్శలు గుప్పించారు.
పోలవరంలో రూ.2347 కోట్లు అదనంగా ఖర్చు చేశారని స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన నివేదికే స్పష్టంచేసిందన్న జీవిఎల్ నరసింహా రావు.. మరి అందుకు ఎవరిని బాధ్యులుగా చేస్తారో కూడా చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజా ప్రయోజనాల కోసమే ఉండాలి కానీ రాజకీయ కక్ష సాధింపు చర్యలుగా ఉండొద్దని ఈ సందర్భంగా జీవీఎల్ సర్కార్‌కి హితవు పలికారు.