ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో మరో అడుగు ముందుకు పడింది. రాజధాని మార్పు అంశాన్ని తేల్చేందుకు నియమించిన  బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ ( BCG ) తుది నివేదికను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డికి అందజేసింది. శుక్రవారం మధ్యాహ్నం సీఎం క్యాంప్ ఆఫీసులో సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన బీసీజీ ప్రతినిధులు నివేదికను అందజేశారు. రాజధానిపై ఇప్పటికే జీఎన్‌ రావు కమిటీ నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. 
రెండు నివేదికలను పరిశీలించనున్న హైపవర్ కమిటీ 
ఈ నెల 6న రెండు నివేదికలను హైపవర్‌ కమిటీ పరిశీలించనుంది. అనంతరం 8న రెండు నివేదికలపై కేబినెట్‌ చర్చించనుంది. హైపవర్‌ కమిటీకి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ సారథ్యం వహిస్తున్నారు. ఈ కమిటీలో మంత్రులు, ఉన్నతాధికారులు ఉన్నారు. బుగ్గన నేతృత్వంలో ఈ నెల 6న తొలిసారిగా కమిటీ సమావేశం జరగనుంది. ఈ కమిటీ 3 వారాల్లో సిఫారసులను ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంది. మూడు రాజధానుల విషయంలో బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ నివేదికలో ఏం ఉంది..? బుగ్గన కమిటీ దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది. 
 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..