కేంద్రమంత్రులుగా అశోకగజపతి, సుజనా చౌదరి రాజీనామా
భారత ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి చేరుకున్న కేంద్ర విమానయాన శాఖమంత్రి పూసపాటి అశోకగజపతి రాజు మరియు కేంద్ర శాస్త్రసాంకేతిక శాఖ సహాయమంత్రి సుజనా చౌదరిలు తమ రాజీనామా లేఖలను ఆయనకు సమర్పించారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి చేరుకున్న కేంద్ర విమానయాన శాఖమంత్రి పూసపాటి అశోకగజపతి రాజు మరియు కేంద్ర శాస్త్రసాంకేతిక శాఖ సహాయమంత్రి సుజనా చౌదరిలు తమ రాజీనామా లేఖలను ఆయనకు సమర్పించారు. తెలుగుదేశం పార్టీ సూచనల మేరకు తాము ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని వారు ఆయనకు తెలిపారు.
ముఖ్యంగా రాష్ట్రానికి చాలా అన్యాయం జరిగిన క్రమంలో.. కేంద్రం సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని.. ఈ క్రమంలో తమ హక్కుల సాధనకై.. ప్రజల అభీష్టం మేరకు రాజీనామా చేయాల్సి వచ్చిందని వారు మీడియాకి తెలిపారు. ఇవే విషయాలను వారు ప్రధాని మోదీతో కూడా పంచుకున్నట్లు సమాచారం. నిన్న సాయంత్రం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ.. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం ఎట్టిపరిస్థితుల్లోనూ సాధ్యం కాదని తేల్చి చెప్పడం తమను బాధించిందని.. అందుకే తాము రాజీనామా చేస్తున్నామని కూడా వారు తెలిపినట్లు సమాచారం.
నిన్న ఇదే విషయంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితో ప్రత్యేకంగా సమావేశమై మాట్లాడాకే.. ఈ నిర్ణయాన్ని తాము తీసుకున్నట్లు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరిలు తెలిపారు. తమ పార్టీ అధినేత సూచనల మేరకే రాజీనామా పత్రాలు తీసుకొని, తాము ప్రధాని వద్దకు వెళ్లామన్నారు. ఈ రోజు ప్రధాని దాదాపు అరగంట పాటు చంద్రబాబు నాయుడితో మాట్లాడాక, తమకు అపాయింట్‌మెంట్ ఇచ్చారని.. ఈ క్రమంలో ఆయనకు పరిస్థితులు అన్నీ వివరించి తాము రాజీనామా పత్రాలు సమర్పించామని వారు తెలియజేశారు. పీఎంఓ కేటాయించిన సమయం ప్రకారం సాయంత్రం 6 గంటలకు ప్రధాని నివాసానికి వెళ్లి మంత్రులు రాజీనామా లేఖలు అందించారు.