Chandrababu Naidu: అమరావతిపైనే అందరి ఆశలు.. చంద్రబాబు వ్యూహం అదేనా..!
Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు తీసుకున్నాక రాజధాని అమరావతిలో మళ్లీ ఆశలు చిగురించాయా...గత ఐదేళ్లుగా మరుగున పడ్డ అమరావతి పనులు మళ్లీ స్పీడ్ కానున్నాయా..అసలు అమరావతి విషయంలో చంద్రబాబు అండ్ కో ఏమనుకుంటోంది . అమరావతిలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న వారి ఆలోచన ఏవిధంగా ఉంది...అసలు అమరావతి ఫ్యూచర్ ఏంటి.
Chandrababu Naidu: 2014లో విభజిత ఆంద్ర ప్రదేశ్ కు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అయ్యారు. ఆనాటి పరిస్థితులు దృష్ట్యా ఏపీకీ చంద్రబాబు అనుభవం ఎంతో అవసరం అని...బాబు లాంటి విజనరీ ఉన్న నాయకుడు అయితే ఏపీనీ అభివృద్ధి పథంలో నడిపించగలరు అని అక్కడి ప్రజలు భావించారు. అన్నింటికి మించి తెలంగాణ రాజధానిగా హైదరాబాద్ ఉండడంతో ఏపీకీ కూడా ఒక అత్యుత్తమ రాజధాని ఉంటే బాగుంటుంది. అది చంద్రబాబు లాంటి నాయకుడితోనే సాధ్యం అని ప్రజలు తెలుగు దేశం పార్టీ పట్టం కట్టారు. దానికి అనుగుణంగా ఏపీకీ రాజధాని ఏ ప్రాంతం అయితే బాగుంటుంది అని చంద్రబాబు కమిటీ కూడా వేశారు. రాజధానికి కావాల్సిన అన్నీ హంగులు కలిగిన నగరం ఏపీలో ఎక్కడా ఉందా అని సీరియస్ గానే కసరత్తు చేశారు. అన్నీ ఆలోచించాక చివరకు గుంటూరు-తుళ్లూరు మధ్యన రాజధాని ఉంటే బాగుంటుందని ఒక అభిప్రాయానికి వచ్చారు. మొత్తానికి రాజధాని ప్రాంతం ఖరారు అయ్యింది. దీనికి ఒక మంచి పేరు ప్రతిపాదించాలని బాబు నిర్ణయించారు.దానికి అనుగుణంగా అమరావతి అనే అద్భుత పేరును రాజధాని ప్రాంతానికి ఖరారు చేశారు.
అమరావతికి ఏపీలోని అన్ని ప్రాంతాల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. ఇక ఏపీకీ రాజధాని లేని లోటు తీరుతుందని అందరూ అనుకున్నారు. అమరావతి కోసం అక్కడి ప్రాంత రైతుల నుంచి వేల ఎకరాల్లో భూమిని సేకరించారు. చాలా మంది రైతులు కూడా రాజధాని కోసం తమ భూములను స్వచ్చంధంగా ఇచ్చారు. మొదట రాజధాని ఏరియా ఖరారు అయ్యింది. ఆ తర్వాత భూ సేకరణ కూడా జరిగింది. ఇక రాజధాని పనులు స్పీడ్ అందుకున్నాయి. అమరావతి ప్రాంతాన్ని చదును చేసి కొత్త నిర్మాణాలు ప్రారంభించారు. అంతా అనుకున్నట్లుగానే అమరావతి రాజధానికి ఒక నిర్మాణ రూపం ఇవ్వాలనకున్న బాబు ఆలోచనలకు దగ్గట్టుగానే పనులు సాగాయి.
కానీ చంద్రబాబు రాజధాని ప్రాంతంలో శాశ్వత నిర్మాణాలు కాకుండా కొన్ని తాత్కాలిక ప్రాతిపదికన నిర్మాణాలు చేపట్టారు. అయితే తాత్కాలిక కట్టడాలు బదులు శాశ్వత కట్టడాలు కడితే అయిపోయేది కదా అని ప్రతిపక్షాల నుంచి విమర్శలు వచ్చాయి. అనవసరంగా కోట్లాది డబ్బును చంద్రబాబు తాత్కాలిక కట్టడాలకు వృధా చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శించాయి. ఒక వైపు ప్రతిపక్షాల విమర్శలు వస్తూనే ఉన్నా టెంపరరీ బిల్డింగ్ లు నిర్మాణాలు ఆగలేదు. ఇదే సమయంలో చంద్రబాబు అమరావితిపై దృష్టి పెడుతూనే మరోవైపు ఏపీకీ ఆయువు పట్టు అయినా పోలవరం లాంటి ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయడానికి కసరత్తు మొదలు పెట్టారు. ఇలా ఒక వైపు అమరావతి నిర్మాణంతో పాటు ఇతర అంశాలపై చంద్రబాబు దృష్టి పెట్టాల్సి రావడంతో రాజధాని అంశం కొంత మందగించింది. ఇంతలోనే ఎన్నికలు కూడా వచ్చాయి. 2019 ఎన్నికలే అమరావతి గతిని మలుపు తిప్పాయి.
2019లో ఏపీలో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు ఘోర ఓటమి పాలయ్యారు. ఇదే అమరావతికి అష్టకష్టాలు తెచ్చిపెట్టింది. ఎన్నికల్లో గెలుపొందిన జగన్ మోహన్ రెడ్డి ఏపీకీ మూడు రాజధానులు అవసరం అని ఒక కొత్త ప్రతిపాదన తీసుకువచ్చారు.దానికి జగన్ చెప్పిన కారణాలు కూడా ఆ సమయానికి ఏపీ ప్రజల్లో కొంత ఆలోచనకు గురి చేశాయి. ఉమ్మడి ఏపీకీ హైదరాబాద్ రాజధానిగా ఉన్న సమయంలో హైదరాబాద్ చుట్టూ పక్కల మాత్రమే అభివృద్ధి జరిగింది. పూర్తిగా అభివృద్ధి చెందిన హైదరాబాద్ ఇప్పుడు తెలంగాణకు మాత్రమే మిగిలింది. రేపటి రోజున అమరావతి కూడా అలా కాకూడదు అనే మూడు రాజధానులు అయితే బాగుంటుందనే వాదన తెర మీదకు తెచ్చారు. రాయలసీమలోని కర్నూలు న్యాయ రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా అలాగే వైజాగ్ ఆర్థిక రాజధానిగా ప్రస్తావిస్తూ జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం జగన్ చేశారు. దీంతో అమరావతి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
2019లో చంద్రబాబు ఓటమి తర్వాత అమరావతిలో చిన్న నిర్మాణం కూడా జరగలేదంటూ అక్కడ ఎలాంటి పరిస్థితి ఏర్పడి ఉంటుందో ఒక సారి ఆలోచించుకోవచ్చు. 2019 వరకు అమరావతి పరిసర ప్రాంతాల్లో కోట్లలో పలికిన భూముల ధరలు జగన్ వచ్చాక అమాంతంగా పడిపోయాయి. అమరావతిలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. ఒక దశలో జగన్ రాజధానిని విశాఖపట్టణానికి తరలిస్తారనే అనుకున్నారు. దీంతో ఇక అమరావతి పరిస్థితి అంతే సంగతలు అనుకున్నారు. విశాఖకు రాజధానిగా తరలించే క్రమంలోనే ఏపీకీ మరోసారి ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికలు కూడా అమరావతిని మరో మలుపు తిప్పాయి. ఈ సారి ఎన్నికల్లో జగన్ ప్రజలు చిత్తుగా ఓడించారు. మళ్లీ చంద్రబాబుకు ఏపీ ప్రజలు పట్టం కట్టారు.
చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావడంతో అమరావతి మళ్లీ ఊపిరి పీల్చుకుంది. గతంలో అమరావతి విషయంలో కొంత ఆలస్యం చేశామని ఈ సారి ఎట్టి పరిస్థితుల్లో ఆ పొరాపాట్లు మళ్లీ రిపీట్ చేయవద్దనే భావనలో బాబు ఉన్నారట. ఇక తాత్కాలిక నిర్మాణాలు కాదు శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాలు చేటపట్టాలని బాబు యోచిస్తున్నారట. వీలైనంత త్వరగా రాజధాని అమరావతిని పూర్తి చేసి ఏపీ ప్రజల్లో పూర్తి భరోసా కల్పించాలని బాబు భావిస్తున్నారట. ఎక్కడైతే పోగొట్టుకున్నామో అదే అమరావతిలో తిరిగి రాబట్టుకోవాలనే దృఢ నిశ్చయంతో బాబు ఉన్నారట. గతంలో ప్రతిపాదించిన నిర్మాణాల నమూనాలకు మరోసారి దుమ్ముదులిపి కాంట్రాక్టర్లను పరుగులు పెట్టించి నిర్మాణాలు పూర్తి చేయాలని బాబు భావిస్తున్నాడట. అమరావతి పూర్తి స్థాయి రాజధానిగా ఏర్పడాలంటే ఇదే సరైన సమయం అని అనుకుంటున్నారట. ఇప్పుడు ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా అది భవిష్యత్తులో ఏపీ ప్రజలకు తీరని అన్యాయం జరిగే అవకాశం ఉందని బాబు భావిస్తున్నారట. ఇప్పుడు తన ముందు ఉన్న ప్రధాన టాస్క్ ఒకటి అమరావతి కాగా మరొకటి పోలవరం అని తన సన్నిహితులు వద్ద చంద్రబాబు చెబుతున్నారట.
అయితే చంద్రబాబు ఆలోచన ఈ విధంగా ఉంటే అమరావతిలో పెట్టుబడులు పెట్టే వారు మాత్రం కాస్త డైలామాలో ఉన్నారట. దానికి కారణం లేకపోలేదు. గత అనుభవాల దృష్ట్యా అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు కొంత మంది ఆలోచిస్తున్నారట. గతంలోనే అక్కడ పెట్టుబడులు పెట్టి తీవ్రంగా నష్టపోయామని ఈ సారి మరి పెట్టుబడులు పెడితే తమ పరిస్థితి ఏంటా అని అనుకుంటున్నారట. అయితే మరి కొద్ది మాత్రం ఆచితూచి అడుగులు వేసే పనిలో ఉన్నారట. అమరావతి విషయంలో మరొక సంవత్సరం అయ్యాక పెట్టుబడులు పెట్టే విషయం ఆలోచిస్తామని అంటున్నారట. ఈ సంవత్సర కాలంలో అమరావతిలో ఏదైనా కదలిక ఉంటే దానికి అనుగుణంగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్దమవుతున్నారట. మరి కొందరు మాత్రం చంద్రబాబు మాత్రమే నమ్ముకొని అమరావతిలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారట. చంద్రబాబు అమరావతిని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తారని నమ్మకం తమకు ఉందని పెట్టుబడులు చెప్పేవారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరి వైఖరి మాత్రం విచిత్రంగా ఉంది. అటు పెట్టుబడులు పెట్టాలని ఉన్నా పెడితే ఏమవుతుందో అని డైలామాలో ఉంటున్నారట. ఇలాంటి వారు మధ్యే మార్గంగా పూర్తి స్థాయిలో కాకుండా పరిమిత స్థాయిలో పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నారట.
మొత్తానికి అమరావతి అంశంలో చంద్రబాబు వ్యూహం ఎలా ఉండబోతుందో అని సర్వత్రా చర్చ జరుగుతుంది. రాజధానిని త్వరగా పూర్తి చేయాలని ప్రజలు భావిస్తుండగా , అమరావతిలో పనులు స్పీడందుకుంటే పెట్టుబడులు పెట్టేందుకు సిద్దంగా ఉన్నామని పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు. ఇక అమరావతి భవిష్యత్తు బాబు చేతిలో ఉంది. దేశానికే ఆదర్శంగా నిలిచేలా రాజధాని అమరావతిని బాబు తీర్చిదిద్దుతారా లేక గతంలో మాదిరి తాత్కాలిక భవనాలతో కాలం గడిపేస్తారో వేచి చూడాలి.
ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..
ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook