అమ‌రావ‌తి: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఓ లేఖ రాసినట్టు తెలుస్తోంది. అమరావతిలో ఇంతకాలం తాను ఉంటున్న నివాసంలోనే ఇకపై కూడా కొనసాగాలని అనుకుంటున్నట్టు ఆ లేఖలో పేర్కొన్న చంద్రబాబు.. ఆ పక్కనే వున్న ప్రజావేదికను ప్రతిపక్ష నేత అయిన తనకు కేటాయించాలని ఆ లేఖలో కోరారు. ఇప్పటివరకు తాను ఉంటున్న ఇంటిని యాజమాన్యం షరతుల మేరకు వినియోగించుకోవాలని అనుకుంటున్నానని వివరిస్తూ తన నివాసానికి అనుబంధంగా వున్న ప్రజావేదికను తనకే కేటాయించాలని చంద్రబాబు ఆ లేఖలో విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. ప్రతిపక్ష నేతగా, ఒక పార్టీ అధినేతగా వున్న తనను కలుసుకునేందుకు ఎంతో ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, ప్రజలు వస్తుంటారనీ.. అందుకు అనుగుణంగా ఆ పక్కనే ఉన్న ప్రజావేదికను అధికారిక కార్యక్రమాల కోసం తాను వినియోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని చంద్రబాబు లేఖలో విజ్ఞప్తి చేసినట్టు వార్తలొస్తున్నాయి.


ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు చేసిన ఈ విజ్ఞప్తిపై రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్‌ ఏం నిర్ణయం తీసుకుంటారోననేదే ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.