వైసీపీ తీరు వల్లే ప్రపంచ బ్యాంకు పెట్టుబడులు వెనక్కి - చంద్రబాబు
రాజధాని అమరావతి ప్రాజెక్టు పెట్టుబడుల విషయంలో వరల్డ్ బ్యాంక్ తప్పకోవడంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు స్పందించారు.
వైసీపీ సర్కార్‌ను ఎండగట్టేందుకు అందివచ్చిన ఏ అవకాశాన్ని జారవిడచకుండా విమర్శలు చేస్తున్న చంద్రబాబు తాజాగా ప్రపంచ బ్యాంకు పెట్టుబడుల ఉపసంహరణ అంశాన్ని లేవనెత్తి ఆరోపణాస్త్రాలు సంధించారు. వైసీపీ తీరు వల్లే అమరావతి నగర అభివృద్ధి ప్రాజెక్టు నుంచి వరల్డ్ బ్యాంకు తప్పుకుందని చంద్రబాబు విమర్శించారు. రాజధాని నిర్మాణానికి రైతులు నుంచి భూములు సేకరిస్తున్న సమయంలో వైసీపీ నేతలు అడ్డుతగిలారని ఆరోపించారు. ఈ క్రమంలో ఒక వైపు నుంచి రైతులను రెచ్చగొడుతూ ..మరో వైపు నుంచి ఆర్థిక, సామాజిక, పర్యావరణం తదితర రంగాలపై చెడు ప్రభావం ఉంటుందంటూ దుష్ప్రచారం చేస్తూ ప్రపంచ బ్యాంకుకు లేఖలు రాశారని విమర్శించారు. ఇలాంటి తప్పుడు ప్రచారం ఫలితంగా ప్రపంచ బ్యాంకు వెనక్కి వెళ్లపోయిందన్నారు. ఇలా వైసీపీ నేతలు ఏపీకి తీరని అన్యాయం చేశారని చంద్రబాబు మండిపడ్డారు.
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు విముఖత వ్యక్తం చేసిందని..పెట్టుబడుల విషయంలో వెనక్కి వెళ్లిందని ఇటివలే మీడియాలో కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. మీడియా కథనాల ప్రకారం స్థానిక ప్రజానికం నుంచి వ్యతిరేకత వ్యక్తమౌతున్న కారణంతో రాజధాని అమరావతి ప్రాజెక్టు నుంచి వరల్డ్ బ్యాంక్ తప్పుకుంది. ఇలా అమరావతి సుస్థిర రాజధాని నగర అభివృద్ధి ప్రాజెక్టు నుంచి ప్రపంచబ్యాంకు వైదొగింది. దీంతో 300 మిలియన్ డాలర్ల రుణ సాయం రాష్ట్ర ప్రభుత్వానికి రాకుండా పోయింది. తాజా పరిణామాలపై టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఈ మేరకు స్పందించారు.