ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంటాయని వస్తున్న వార్తలపై రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పందించారు. నాడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే నందమూరి తారకరామారావు అనే గొప్ప వ్యక్తి తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగిందని.. అలాంటి కాంగ్రెస్‌తో ఒకవేళ సీఎం చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకుంటే తప్పు చేసినట్లేనని.. అయితే ఆయన ఆ తప్పు ఎప్పుడూ చేయరని తాము భావిస్తున్నామని ఆయన అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాటం చేయడం కోసమని.. అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకుంటే ప్రజలు తమను క్షమించరని.. అంతకు ముందే తమకు తామే క్షమాపణ చెప్పుకొనే పరిస్థితి కూడా రాదని ఆయన తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేసే యోచనలో లేదని.. అలా పనిచేసే అవకాశం కూడా ఉంటుందని తాను భావించడం లేదని కూడా అయ్యన్నపాత్రుడు తెలియజేశారు. ఇలాంటి విషయాలన్నీ నమ్మకూడదన్నారు. 


అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం నుండి ఏపీ శాసనసభకు ఎంపికై.. ఆ తర్వాత మంత్రిగా కూడా బాధ్యతలు స్వీకరించారు. 1996లో 11వ లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో కూడా తెలుగు దేశం తరపున అనకాపల్లి లోక్‌సభ సభ్యునిగా ఎన్నికయ్యారు అయ్యన్నపాత్రుడు. 2004 ఎన్నికల్లో అయ్యన్నపాత్రుడు టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించినా, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఏ పదవీ చేపట్టకుండా ఖాళీగానే ఉండిపోయారు. ఆ తరువాత 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ముత్యాలపాప చేతిలో అయ్యన్న ఓటమి పాలయ్యారు. తిరిగి 2014 ఎన్నికలలో శాసనసభ్యునిగా విజయం సాధించి మంత్రివర్గంలో నియమించబడ్డారు.