Independence Day Celebrations: అన్ని సేవలు ఇంటి వద్దకే.. గ్రామ స్వరాజ్యం తీసుకువచ్చాం: సీఎం జగన్
CM Jagan Speech In Independence Day Celebrations: దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోవత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయ జెండాను సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.
CM Jagan Speech In Independence Day Celebrations: 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ భారతి దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్టేడియంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను జగన్ ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రజలందరికీ 77వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అధికారులకు ముఖ్యమంత్రి మెడల్స్ ప్రదానం చేశారు.
అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సమరయోధుల బలిదానాన్ని గుర్తుచేస్తూ మన జాతీయ జెండా ఎగురుతోందని అన్నారు. 76 ఏళ్ల ప్రయాణంలో దేశం ఎంతో పురోగమించిందని.. వ్యవసాయం, పరిశ్రమ, సేవారంగంలో ఎంతో ప్రగతి సాధించిందని అన్నారు. రాష్ట్రంలో 50 నెలల్లో గ్రామ స్వరాజ్యానికి అర్థం తీసుకువచ్చామని.. గ్రామాల్లో విలేజ్ క్లినిక్‌లు, డిజిటల్ లైబ్రరీలు అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. పౌర సేవలను ఇంటింటికి తీసుకెళ్లగలిగామని.. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చామని తెలిపారు.
గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయని మార్పులు తీసుకువచ్చామని ముఖ్యమంత్రి చెప్పారు. సంక్షేమ పథకాలన్నీ మహిళల పేరు మీదే ఇస్తున్నామని.. 2 లక్షల 31 వేల కోట్లను నేరుగా ప్రజలకు అందించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా పేదలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకే కేంద్రాలతో గ్రామ స్వరాజ్యానికి అర్థం తీసుకువచ్చామని.. ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేదన్నారు. అన్ని సేవలు ఇంటి వద్దకే అందిస్తున్నామ్నారు.
పోలవరం పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పిన సీఎం జగన్.. 2025 జూన్ నాటికి ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. వెలిగొండలో మొదటి టన్నెల్ పూర్తి చేశామని.. రెండో టన్నెల్ పనులు త్వరలోనే పూర్తవుతాయని అన్నారు. సామాజిక న్యాయం అనేది నినాదం కాదని.. దాన్ని అమలు చేసి చూపించామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చామని.. వికేంద్రీకరణతో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించామని చెప్పారు. కొత్తగా 13 జిల్లాలను ఏర్పాటు చేశామని గుర్తుచేశారు.
అర్హులందరికీ పథకాలు అందించేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు ముఖ్యమంతి. రైతులకు పెట్టుబడి కోసం రైతు భరోసా అందిస్తున్నామని.. విత్తనం నుంచి అమ్మకం వరకూ రైతుకు అండగా నిలుస్తున్నామని చెప్పారు. పాలనలో ఏ ప్రభుత్వం చేయని మార్పులు తీసుకొచ్చాన్నామరు. 98.5 శాతం వాగ్దానాలను అమలు చేశామని తెలిపారు. విద్యావ్యవస్థలో పలు సంస్కరణలు అమలు చేస్తున్నామని తెలిపారు. నాడు-నేడుతో 45 వేల ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మారిపోయానని అన్నారు. రాష్ట్రంలో కొత్తగా 127 భారీ పరిశ్రమల ఏర్పాటు చేస్తున్నామని.. రాష్ట్రానికి వచ్చిన పెట్టబడులు రూ.67,196 కోట్లు అని సీఎం జగన్ తెలిపారు.