కిరణ్ కుమార్ రెడ్డి నాలుగేళ్ల బ్రేక్ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ దీనికి సంబంధించిన ముహుర్తం కూడా ఖారారైనట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో తనతో సత్సంబంధాలున్న నేతలతో కిరణ్ సంప్రదిస్తున్నట్లు తెలిసింది. తాను ముఖ్యమంత్రిగా వున్న సమయంలో మంత్రులు, ఎమ్మెల్యేలుగా వున్న పలువురు నాయకులకు కిరణ్‌కుమార్‌రెడ్డి ఫోన్‌ చేసి తనతోపాటు తిరిగి పార్టీలో చేరాల్సిందిగా కోరుతున్నారు. మాజీలందరూ తిరిగి కాంగ్రెస్ లో చేరితో పూర్వవైభవం తీసుకురావచ్చని కిరణ్ భరోసా ఇస్తున్నట్లు సమచారం. కిరణ్ వెంట వచ్చేందుకు పలువురు సీనియర్ నేతలు సిద్ధమౌతుండగా మరి కొందరు నిర్ణయాన్ని పెండింగ్ లో పెట్టినట్లు తెలిసింది.
 
ఏపీలో మళ్లీ జవసత్వాలు కూడదీసుకునేందుకు కాంగ్రెస్‌ యత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర విభజన తర్వాత పార్టీని విడిచిపెట్టిన నాయకులందరినీ తిరిగి పార్టీలో చేర్చుకునేందుకు పార్టీ అధిష్థానం రంగంలోకి దిగింది. ఈ ఆపరేషన్ లో భాగంగా ముందుగా కిరణ్ కుమార్ రెడ్డిని సంప్రదించింది. కాంగ్రెస్ ప్రతిపాదనను కిరణ్ ఓకే అనడంతో మిగిలిన వారిని కూడా పార్టీలో చేర్చే బాధ్యతను ఆయనకే అప్పగించడంతో మాజీలను తిరిగి కాంగ్రెస్ లో గూటికే చేర్చే ప్రయత్నాలు చేస్తున్నారు.