TDP Manifesto: తెలుగుదేశం మినీ మేనిఫెస్టోపై విమర్శలు, ప్రజల్ని ఆకట్టుకుంటుందా లేదా
TDP Manifesto: రాజమండ్రిలో జరిగిన మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. మరోవైపు ఆరు ప్రధాన అంశాలతో మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ ఉచితాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపైనే ఆ పార్టీ సామర్ధ్యం ఆధారపడి ఉంది.
TDP Manifesto: తెలుగుదేశం పార్టీ మహానాడులో ఎన్నికల మినీ మేనిఫెస్టో విడుదలతో ఎన్నికలకు శంఖారావం పూరించింది. తెలుగుదేశం అధికారంలో వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయనే అధికార పార్టీ ప్రచారానికి మేనిఫెస్టోతో టీడీపీ సమాధానం చెప్పిందా లేదా డిఫెన్స్‌లో పడిందా అనేది చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటి వరకూ అధికార పార్టీపై, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై విమర్శలు గుప్పిస్తూ శ్రీలంకలా తయారౌతుందని ఆరోపణలు చేసిన టీడీపీ విడుదల చేసిన మేనిఫెస్టో అదే రీతిన ఉండటం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికే అలాంటి పధకాలు అందుబాటులో ఉన్నప్పుడు కొత్తగా టీడీపీ హామీ ఇవ్వడంలో అర్ధమేంటనే ప్రశ్నలు విన్పిస్తున్నాయి. అమ్మఒడికి ప్రత్యామ్నాయంగా తల్లికి వందనం పధకాన్ని ప్రకటించింది టీడీపీ. అమ్మఒడిలో ఒక బిడ్డకు మాత్రమే ప్రయోజనం వర్తిస్తే..తల్లికి వందనం ద్వారా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికీ ఇస్తామంటోంది.
వైఎస్సార్ చేయూతలో భాగంగా 45 దాటిన మహిళలకు ఏటా ఇస్తున్న 18 వేల స్థానంలో టీడీపీ 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు నెలకు 1500 ఇస్తానంటోంది. రైతులకు ప్రస్తుతం ప్రభుత్వం ఏడాదికి అందిస్తున్న 12 వేల స్థానంలో టీడీపీ 15 వేలు ఇస్తానని హామీ ఇస్తోంది. వీటికి తోడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి మూడు సిలెండర్లు ఉచితం, నిరుద్యోగ భృతి, ఇంటంటికీ కుళాయి, బీసీ రక్షణ చట్టం వంటివి మేనిఫెస్టోలో చేర్చింది.
వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాలను తూచా తప్పకుండా ప్రతినెలా అందిస్తోంది. ఈ విషయంలో మాత్రం జగన్ ప్రభుత్వాన్ని విమర్శించలేరు. అటువంటప్పుడు అవే పధకాలను కొత్తగా ఇస్తామనడం ద్వారా టీడీపీ ఏం సాధిస్తుందనేది ప్రశ్నార్ధకంగా మారింది. అదే సమయంలో టీడీపీ మేనిఫెస్టోపై కర్టాటక ప్రభావం పడిందని తెలుస్తోంది. కర్ణాటకలో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇలాంటి హామీలనే ఇచ్చి ఆకట్టుకుంది. మేనిఫెస్టోను చిత్తుకాగితంలా భావించే టీడీపీకు చిత్తశుద్ది లేదని అధికార పార్టీ విమర్శలు అందుకుంది. గతంలో కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను నెరవేర్చని సంగతిని గుర్తు చేస్తున్నారు.
ఉచిత పథకాలతో రాష్ట్రాన్ని శ్రీలంకలా మార్చారంటూ విమర్శలు చేసిన టీడీపీ ఇప్పుడు ఈ మేనిఫెస్టోకు ఎలా సమాధానం చెబుతుందనే విమర్శలు వస్తున్నాయి. సంపద సృష్టిస్తామని చెప్పడం కాకుండా ఆ సంపదను ఎలా పెంచుతారనే స్పష్టత లేదనే విమర్శలు వస్తున్నాయి. మేనిఫెస్టోను పూర్తిగా అమలు చేసిన ప్రభుత్వం ఉండగా టీడీపీ మేనిఫెస్టోను ప్రజలు ఎందుకు నమ్మాలనే ప్రశ్న వస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook