Dastagiri Land Settlements: పోలీసు భద్రత మధ్యే దందాలకు తెర లేపిన దస్తగిరి
Dastagiri Land Settlements: మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏ 4 నిందితుడుగా ఉన్న దస్తగిరి దాదాగిరికి అడ్డు అదుపు లేకుండా పోతోంది అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసులో సీబీఐ వద్ద అప్రూవర్‌గా మారిన దస్తగిరి.. ఆ తరువాత బెయిల్‌పై విడుదలై బయటికొచ్చి.. తనకు ప్రాణ భయం ఉందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై, ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
Dastagiri Land Settlements: మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏ 4 నిందితుడుగా ఉన్న దస్తగిరి , దాదాగిరికి అడ్డు అదుపు లేకుండా పోతోంది అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పట్టణంలోని ఓ వివాదాస్పద స్థలం విషయంలో దస్తగిరి హల్చల్ చేస్తుండట.. అది కూడా తన చుట్టూ ప్రభుత్వం అతడి భద్రత కోసం నియమించిన పోలీసులను వెంటేసుకుని వెళ్లి బెదిరింపులకు పాల్పడుతుండటం వివాదాస్పదంగా మారింది.
దస్తగిరిపై వస్తోన్న ఆరోపణలు చూసి ఆయనేదో ఓ బలమైన రాజకీయ నాయకుడు అనుకుంటే పొరపాటే. పులివెందులలో ఓ సాదాసీదా మనిషి. మాజీమంత్రి వైయస్ వివేకానంద రెడ్డి వద్ద కొద్దిరోజులు డ్రైవర్ గా పనిచేశాడు. ఆ తర్వాత వైఎస్ వివేకానంద రెడ్డి వద్ద పని మానేసి తోపుడు బండిపై ఐస్ క్రీమ్ అమ్ముకునేవాడు. 2019 మార్చి 15న వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు గురైన సంగతి తెలిసిందే. వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో దస్తగిరి ఏ4 నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.
అయితే, వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో సీబీఐ వద్ద అప్రూవర్‌గా మారిన దస్తగిరి.. ఆ తరువాత బెయిల్‌పై విడుదలై బయటికొచ్చారు. ఈ కేసులో సాక్షిగా ఉన్నటువంటి తనకు ప్రాణ భయం ఉందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై, ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణల వర్షం గుప్పించారు. దీంతో వెంటనే ప్రభుత్వం దస్తగిరికి భారీ భద్రత కల్పించింది. ప్రభుత్వం తన భద్రత కోసం పోలీసులను నియమించడాన్ని అదునుగా తీసుకున్న దస్తగిరి.. ఆ తరువాత తోపుడు బండిపై ఐస్ క్రీమ్ అమ్ముకోవడం మానేసి అదే పోలీసులను వెంటబెట్టుకొని వివాదాస్పద స్థలాల్లోకి ప్రవేశించి దాదాగిరికి తెరలేపాడు అనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఎవరైనా తన మాట వినకుంటే వైఎస్ వివేకాకు పట్టిన గతే పడుతుంది అని దస్తగిరి బెదిరింపులకు కూడా పాల్పడుతున్నాడు అంటున్నారు బయటికి తమ పేర్లు చెప్పుకోవడం ఇష్టం లేని కొంతమంది బాధితులు.
ఇదిలావుంటే, సంచలనం సృష్టించిన ఒక హత్య కేసులో నిందితుడిగా ఉంటూ బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తికి ప్రభుత్వం ఇంత భారీ భద్రత కల్పించడం ఏంటంటూ జనం ముక్కున వేలేసుకుంటున్నారు. మరోవైపు విధి నిర్వహణలో ఉన్నందుకుగాను దస్తగిరి వెంట వెళ్లకతప్పని పరిస్థితి ఉందని.. అతడు చేసే పనులను చోద్యం చూస్తూ ఉన్నట్టు ఉండాల్సిన దుస్థితి ఏర్పడిందనే నైరాశ్యం అతడికి భద్రత అందిస్తున్న పోలీసుల్లోనూ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దస్తగిరి వైఖరిపై ప్రభుత్వం ఎలా స్పందించనుందా అనేది వేచిచూడాల్సిందే మరి.