బాబ్లీ కేసు: చంద్రబాబు రీకాల్ పిటిషన్ తిరస్కరించిన న్యాయస్థానం
మహారాష్ట్ర : బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆందోళన చేసిన కేసులో చంద్రబాబు స్వయంగా కోర్టుకు హాజరుకావాల్సిందే నంటూ ధర్మాబాద్ న్యాయస్థానం స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళ్లినట్లయితే బాబ్లీ కేసులో విచారణ నిమిత్తం చంద్రబాబు తరఫు న్యాయవాది సుబ్బారావు ఈ రోజు కోర్టుకు హాజరై రీకాల్ పిటిషన్‌ను దాఖలు చేశారు. రీకాల్ పిటిషన్‌ను తిరస్కరించిన ధర్మాబాద్ కోర్టు... చట్టం ముందు అందరూ సమానమేనని.. సీఎం అయినా.. సామాన్యులైనా కోర్టు ఆదేశాలు పాటించాల్సిందేనని న్యాయూమర్తి స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు తరపు న్యాయవాది బదులిస్తూ.. పాలనా వ్యవహారాల్లో బిజీగా ఉన్నందున కోర్టుకు హాజరయ్యేందుకు సమయం కోరారు. దీనికి సమ్మతించిన న్యాయస్థానం కేసు విచారణను అక్టోబరు 15కు విచారణ వాయిదా వేసింది. తదుపరి విచారణకు నోటీసులు అందుకున్న చంద్రబాబుతో సహా 16 మంది న్యాయస్థానానికి తప్పకుండా హాజరు కావాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. మరోవైపు ఈ కేసులో వారెంట్ అందుకున్న అప్పటి తెలంగాణ టీడీపీ నేతలకు బెయిల్ మంజూరు అయ్యింది. మాజీ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, ప్రకాశ్‌గౌడ్, కేఎస్ రత్నంలకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
2010లో మహారాష్ట్ర సర్కార్ అక్రమంగా నిర్మాణం చేపడుతున్న బాబ్లీ ప్రాజెక్టును టీడీపీ ఎదురొడ్డి నిలబడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించేలా ఉన్న ఈ ప్రాజెక్టు అడ్డుకునేందుకు రైతులతో కలిసి బాబ్లీ ప్రాజెక్టు వద్ద చంద్రబాబు ధర్నా చేపట్టారు. విధుల్లో ఉన్న పోలీసులను అడ్డుకోవడంతో పాటు ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరించారని ఆరోపిస్తూ చంద్రబాబు పాటు పలువురు టీడీపీ నేతలపై మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ నిమిత్తం చంద్రబాబు సహా నోటీసులు అందుకున్న టీడీపీ నేతలు హాజరుకావాల్సిందేనంటూ న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీనిపై చంద్రబాబు ఏ మేరకు స్పందిస్తారనేది గమనార్హం.