త్రిపుల్ తలాక్ బిల్లుపై వినిపిస్తున్న భిన్న వాదనలు ఇవే
మోడీ సర్కార్ పార్లమెంట్ లో ఆమెదించుకున్న త్రిపుల్ తలాక్ బిల్లుపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి
కేంద్రం తీసుకొచ్చిన త్రిపుల్ తలాఖ్ బిల్లు ప్రస్తుతం చర్చనీయంశంగా మారింది. తలాక్ బిల్లుపై అధికార, ప్రతిపక్ష నేతలు వాదనలు భిన్నవాదనలు వినిపిస్తున్నారు. మహిళా హక్కులను పరిరక్షణ కోసమే ఈ బిల్లు తీసుకొచ్చామని మోడీ సర్కార్ చెబుతుంటే .. ఒక వర్గంపై కక్ష సాధించేందుకే త్రిపుల్ తలాఖ్ బిల్లు తీసుకొచ్చారని ప్రతిపక్షం వాదిస్తోంది. ఈ నేపథ్యంలో అధికారం ప్రత్రిపక్ష పార్టీల వాదనను ఒక్క సారి పరిశీలిద్దాం...
మోడీ సర్కార్ వాదన ఇదే..
త్రిపుల్ తలాక్ బిల్లు సభలో ప్రవేశపెట్టిన సందర్భంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ మాట్లాడుతూ మహిళా హక్కులను పరిరక్షణే ఈ బిల్లు తీసుకొచ్చామన్నారు. ప్రపపంచంలోని దాదాపు 20 ఇస్లాం దేశాలు తలాఖ్ పద్దతులను నియంత్రిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయ దేశాలు త్రిపుల్ తలాఖ్ పద్దని రద్దు చేశాయని గుర్తు చేశారు. ముస్లిం మహిళల మంచి కోసం ప్రజాస్వామ్య దేశమైన మనం ఎందుకు ఆ పని చేయకూడదని ప్రశ్నించారు. హిందువుల్లోనూ బహుభార్యత్వం, వరకట్నం తదితర నేరాలకు జైలుశిక్ష ఉందని గుర్తుచేసిన రవిశంకర్.. తక్షణమే ట్రిపుల్ తలాక్ చెప్పే వారికి జైలు శిక్ష విధించడాన్ని సమర్థించారు. భర్తల నుంచి ముస్లిం మహిళల హక్కులకు రక్షణ కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఈ బిల్లును తెచ్చిందని రవిశంకర్ తెలిపారు.
త్రిపుల్ తలాఖ్ బిల్లును రాజకీయ కోణంలో కాకుండా, మానవత్వం, లింగ సమానత్వం, మహిళా సాధికారత కోణంలో చూడాలని కోరారు. త్రిపుల్ తలాఖ్ బిల్లు పూర్తిగా ముస్లిం మహిళల హక్కులకు సంబంధించినదని తెలిపారు. ఇందులో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదన్నారు. అదే సమయంలో ఇది ప్రార్థన, సంప్రదాయాలు, ఆచారాలు, మతానికి సంబంధించిన బిల్లు కాదని సభలో కేంద్ర మంత్రి రవిశంకర్ స్పష్టం చేశారు.
ప్రతిపక్షాల అభ్యంతరాలు ఇవే..
కేంద్రం ప్రతిపాదిస్తున్న ఈ బిల్లులో తలాక్ చెప్పిన భర్తకు మూడేళ్లు జైలు శిక్ష విధించడం అతనికున్న చట్టబద్ధమైన హక్కుకు వ్యతిరేమని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అలాగే ఈ వ్యవహరంలో మూడేళ్ల పాటు జైలుకు పంపడం వల్ల భర్తకు పునరాలోచించే అవకాశం లేకుండా పోతుందని ఆరోపిస్తున్నారు. సరే తలాఖ్ ఇచ్చి శిక్ష అనుభవిస్తున్న సమయంలో భర్త..విడాకులు ఇచ్చిన తన భార్యకు ఏ విధంగా జీవనభృతి అందించగలడని ప్రతిపక్షాలు ప్రశ్నించారు.
ఓ వర్గాన్ని టార్గెట్ చేసేందుకే - ఆజాద్
ఇది ముమ్మటికి రాజకీయ లక్ష్యంతో ఓ వర్గాన్ని టార్గెట్ చేస్తూ తీసుకొచ్చిన బిల్లు అని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇప్పటికే ఈ పద్దతిని సుప్రీంకోర్టు నిషేదించినందును ప్రత్యేకంగా చట్టం తీసుకురావాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ అభిప్రాయపడ్డారు. ముస్లిం ఇళ్లలో గొడవలు పెట్టడానికి రాజకీయ దురుద్దేశంతో ఈ బిల్లును తెచ్చారని రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ ఆరోపించారు.
ఇది ముస్లిం వర్గంపై దాడి - ఓవైసీ
ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ మాట్లాడుతూ త్రిపుల్ తలాక్ బిల్లు తీసుకురావడమనే ముస్లింలపై దాడుల్లో ఓ భాగంగా అభివర్ణించారు..పైకి మహిళా హక్కులను పరిరక్షణకు అని కేంద్రం చెబుతున్నప్పటికీ ఇది కుట్రపూరితంగా చర్యగా అని ఆరోపించారు. ఈ చట్టం ముస్లిం మహిళలకు వ్యతిరేకమనీ.. వారిని మరింత దీనావస్థలోకి నెడుతుందని ఒవైసీ అభిప్రాయపడ్డారు. రాజ్యాంగంపై ఉన్న బలమైన నమ్మకంతో అణచివేతకు అన్యాయానికి, హక్కుల తిరస్కరణకు వ్యతిరేకంగా పోరాడతామని అసద్ పేర్కొన్నారు. భారత రాజ్యాంగ బహుళత్వం, వైవిధ్యతను కాపాడేందుకు ఈ చట్టం రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తామని అసదుద్దీదన్ తెలిపారు.
ఇది సామాజిక సమస్య - విజయసాయిరెడ్డి
త్రిపుల్ తలాఖ్ అంశాన్ని ఒక సామాజిక సమస్యగా చూడాలని... అయితే ప్రస్తుతం తీసుకొచ్చిన బిల్లులో ట్రిపుల్ తలాక్‌ను నేరపూరితంగా మార్చారని విమర్శించారు. ఇలాంటి చర్యల వల్ల పరిష్కారం లభించదని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు.