Dual Votes: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో డబుల్ ఎంట్రీ ఓట్లు, తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల రాజకీయం, ఈసీకు ఫిర్యాదు
Dual Votes: ప్రజాస్వామ్యంలో ఓటుహక్కుఅత్యంత శక్తివంతమైన ఆయుధం. ఆ ఒక్క ఓటు హక్కుతోనే ప్రభుత్వాలు తలకిందులౌతుంటాయి. మరి అలాంటి ఓటు హక్కు దుర్వినియోగమైతే లేదా రెండేసి రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉంటే ఇక విలువేముంటుంది..
Dual Votes: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అదే జరుగుతోంది. రెండు రాష్ట్రాల్లో ఓటు హక్కు కలిగి ఉండటమే కాకుండా అక్కడా ఇక్కడా రెండు చోట్లా ఓటేసేందుకు సిద్ధమైపోతున్నారు. ఇది చాలా ప్రమాదకర పరిస్థితి. అలాంటి ఒక్క ఓటున్నా ప్రమాదకరమే కానీ ఇక్కడ లక్షల్లో అలాంటి డబుల్ ఓటర్లు ఉన్నారు. అందుకే రాజకీయ పార్టీలు ఈ అంశంపై దృష్టి సారించాయి.
ఎన్నికల వేళ ఓటు రాజకీయం మొదలైంది. తెలంగాణ ఎన్నికల ముగియడంతోనే ఏపీలో ఓట్ల పంచాయితీ ప్రారంభమైంది. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ ఓటు హక్కు కలిగి ఉన్న అంశం ఇప్పుడు రాజకీయంగా రచ్చ రేపుతోంది. ఉద్యోగం కోసమో, ఉపాధి కోసమో తెలంగాణలో స్థిరపడినవాళ్లంతా ఇక్కడ ఓటు హక్కు పొందారు. అదే సమయంలో ఏపీలో కూడా ఓటు హక్కు కలిగి ఉన్నారు. అయితే ఈ సంఖ్య పదుల్లో, వందల్లో కాకుండా లక్షల్లో ఉండటం ఆందోళన కల్గిస్తోంది. 2018లోనే ఈ అంశం అప్పట్లో తెరపైకి వచ్చినా ఎన్నికల సంఘం నిర్లక్ష్యం వహించింది. ఇప్పుడు ఏపీలో అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ ఈ అంశంపై దృష్టి సారించింది. ఏపీలో స్థానికత, కలిగి తెలంగాణలో ఓటు హక్కు కలిగినవాళ్లు 40 లక్షల వరకూ ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. వీరిలో కనీసం 10 లక్షల మందికి ఏపీలోనూ ఓటు హక్కు ఉందని వైసీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
డిసెంబర్ నెలాఖరుకు ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు. ఈలోగా రెండు చోట్ల ఓటు హక్కు కలిగినవారిని గుర్తించి తొలగించాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే ఈ విషయమై అధికార పార్టీ తరపున మంత్రులు వేణుగోపాల కృష్ణ, జోగి రమేష్ , శాసనమండలి విప్ లేళ్ల అప్పిరెడ్డి, ఎంపీ గురుమూర్తి ఏపీ ఎన్నికల కమీషనర్ మీనాకు ఫిర్యాదు చేశారు.
ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో ఓటేసినవాళ్లు తిరిగి ఏపీ ఎన్నికల్లో ఓటేయకుండా చూడాలని వినతిపత్రం సమర్పించారు. ముఖ్యంగా ఓ సామాజికవర్గం ఓట్లు ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఉన్నాయని, ఇలాంటి డూప్లికేట్లు తొలగించాల్సని ఉందన్నారు. రెండు రాష్ట్రాల్లో ఓటు హక్కు కలిగినవాళ్లు 4 లక్షల 80 వేల 264 ఉన్నాయంటూ ఆధారాలతో ఎన్నికల కమీషన్‌కు అందించారు. ఇలాంటి డబుల్ ఎంట్రీ ఓట్లను తొలగించాలని కోరారు. అర్హులైనవారికి దేశంలో ఒకే చోట ఓటు హక్కు ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
ఓటర్ల జాబితాలో పేరు ఉండి, స్థానికంగా నివసించని ఓట్లను ఎప్పటికప్పుడు తొలగించకుండా వేర్వేరు కారణాలతో బీఎల్వోలు తొలగించకుండా వదిలేస్తుండటం వల్ల ఈ పరిస్థితి తలెత్తుతోంది. స్థానిక నేతల ఒత్తిడి, ఓటర్ల వినతులు వంటి కారణాలతో ఆ ఓట్లు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. తెలుగు రాష్ట్రాల ఓటర్లు దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఉంటున్నా మిగిలిన రాష్ట్రాలతో పెద్దగా సమస్య లేదని ఎన్నికల సంఘం చెబుతున్న వాదన అర్ధరహితంగా ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తికి ఒకే రాష్ట్రంలో ఓటు హక్కు ఉండాలి. ఆ ఓటు హక్కు ఎక్కడుండాలనేది సదరు ఓటరు, ఎన్నికల సంఘం ఓటరు అర్హత ఆధారంగా నిర్ణయించాల్సి ఉంటుంది. సమస్య లేదు కాబట్టి రెండు రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉన్నా ఫరవాలేదని చెప్పడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమే.
ఎన్నికల సంఘం భావిస్తున్న ఈ వాదన మరోరకంగా కూడా అర్ధ రహితం. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలైతే ఇప్పుడు ముగిసినా త్వరలో ఏపీ పార్లమెంట్, అసెంబ్లీతో పాటు తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలు కూడా జరగనున్నాయి. అప్పుడు కూడా రెండు చోట్లా ఓటేసేందుకు సిద్ధమైతే పరిస్థితి ఏంటనే ప్రశ్నకు సమాధానం లేదు. రెండు రాష్ట్రాల్లో ఓటు హక్కు కలిగి ఉండి మొన్న తెలంగాణలో ఓటేసి ఇప్పుడు ఏపీలో ఓటేసేందుకు సిద్ధమౌతున్న ఓటర్ల సంఖ్య ఫలితాల్ని తారుమారు చేసే స్థితిలో ఉండటం వల్ల పరిస్థితి ఆందోళనకరం కావచ్చు. అందుకే అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ డబుల్ ఎంట్రీ ఓట్లపై దృష్టి సారించింది.
Also read: Rain Alert: ఏపీలో తొలగని వర్షముప్పు, ఆ 5 జిల్లాలకు ఆరెంజ్ ఆలర్ట్ జారీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook