ఢిల్లీ: ఓటరు కార్డుకు ఆధార్ ను లింక్ చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ కేంద్రానికి ఎన్నికల సంఘం కోరింది. బోగస్ ఓట్లు ఏరివేయాలంటే ఆధార్ అనుసంధానమే మార్గమని తెలిపింది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖకు ఎన్నికల సంఘం లేఖ రాసింది. ఇందు కోసం ప్రజా ప్రాతినిధ్య చట్టం(1950) నిబంధనల్లో ఇందుకోసం సవరణలు చేయాలంటూ న్యాయ మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈసీ వాదన ఇదే....
 ఒక వ్యక్తికి ఒకటికి మించి ఓటరు కార్డులు ఉన్నాయి. దీనికి తోడు నకిలీ అప్లికేషన్లు, బోగస్ ఓట్లు. ఓటర్ జాబితాలో చాలా తప్పులు ఉంటున్నాయి. దీనికి సంబంధించి తమకు చాలా ఫిర్యాదులు అందాయని వాటికి పరిష్కారం చూపాలంటే  ఓటర్ ఐడీకి ఆధార్ లింక్ చేయాల్సి ఉందని లేఖలో పేర్కొంది. ఇందుకోసం అనుమతి ఇవ్వాలని కేంద్రానికి ఈసీ కోరింది.


సుప్రీంకోర్టు తీర్పుతో ....
వాస్తవానికి గత ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అందు కోసం ఈసీ ప్రత్యేక కసరత్తు కూడా చేసింది. అయితే దీని అమలుకు సుప్రీంకోర్టు తీర్పు అడ్డంకిగా మారడంతో ఈ ప్రతిపాదనను విరమించుకుంది. సుప్రీం తీర్పు ప్రకారం చట్టపరమైన అనుమతి లేకుండా ఏ సంస్థ అయినా ఎవరి ఆధార్‌ కార్డుల వివరాలు సేకరించకూడదని ఉంది. దీంతో ఇలా ఆ ప్రతిపాదన మూలన పడింది. దీనిని అధిగమించేందుకు ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల్లో సవరణలు చేయాలని ఈసీ తాజాగా ప్రభుత్వాన్ని కోరింది. ఈ  ప్రతిపాదన అమలైతే ఒక వ్యక్తి ఒకటికి మించి ఓటరు కార్డులు కలిగి ఉండకుండా నివారించే అవకాశం ఏర్పడుతుందని ఈసీ వాదిస్తోంది. మరి ఎన్నికల సంఘం విజ్ఞప్తికి కేంద్రం ఏ మేరకు స్పందిస్తుందనే వేచిచూడాల్సి ఉంది.