YS Jagan: చంద్రబాబుకు మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రశ్నాస్త్రాలు.. ఇసుక దోపిడీపై నిలదీత
YS Jagan Questions To Chandrababu About Sand Policy: ఇసుక విధానంపై సీఎం చంద్రబాబును వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం జగన్ నిలదీశారు. ప్రశ్నాస్త్రాలు సంధించి చంద్రబాబును నిలదీశారు.
YS Jagan Mohan Reddy: అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇసుక విధానం పేరిట దోపిడీ చేస్తోందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. దొంగే దొంగ అన్నట్టు సీఎం చంద్రబాబు వ్యవహార శైలి ఉందని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట వేరు ఇప్పుడు చేస్తున్నది వేరని మండిపడ్డారు. తమ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు, విమర్శించిన వాళ్లు నేడు అదే రీతిలో చేస్తున్నారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
Also Read: AP Politics: వైసీపీకు మరో షాక్, మళ్లీ సొంతగూటికి చేరనున్న మాజీ ఎమ్మెల్యే
కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానంపై మాజీ సీఎం వైఎస్ జగన్ 'ఎక్స్' వేదికగా ప్రశ్నాస్త్రాలు సంధించారు. సీఎం చంద్రబాబుకు ట్విటర్‌లో ఐదు ప్రశ్నలు వేశారు. ఇసుక విధానంలో చంద్రబాబు చేస్తున్న తప్పులు, మోసాలు, దోపిడీని ప్రశ్నలతో వివరించారు. తమ ప్రభుత్వ హయాంలో పారదర్శకంగా ఇసుక విధానం ఉందని.. పేదలకు అతి తక్కువ ఇసుక ధర లభించేదని.. ప్రభుత్వానికి ఆదాయం కూడా వచ్చేదని చెప్పారు.
Also Read: Chandrababu: పండుగ రోజు కూడా పాలనలో సీఎం చంద్రబాబు బిజీబిజీ.. ఉల్లి, టమాట ధరపై శుభవార్త
ప్రశ్నలు ఇవే..
- గత ప్రభుత్వం మీద నిందలు వేసి, అబద్ధాలు చెప్పి, ఇప్పుడు ఇసుక వ్యవహారంలో చంద్రబాబు చేస్తున్నదేంటి? ఎక్కడైనా ఉచితంగా ఇసుక లభిస్తోందా? లభిస్తే ఎక్కడో చెప్పగలరా? అని మాజీ సీఎం జగన్ సవాల్ విసిరారు. తమ ప్రభుత్వంలో రాష్ట్ర ఖజానాకు కనీసం డబ్బులైనా వచ్చేవి ఇప్పుడు అదికూడా లేదని ఎత్తి చూపారు. ఇసుక కొందామంటేనే మా ప్రభుత్వంలో కన్నా ప్రస్తుతం రెండింతలు ధర ఉందని చెప్పారు. 'ఎన్నికల్లో ఉచితంగా ఇసుకను ఇస్తామంటూ ఊరూరా డప్పువేసిన విషయాన్ని మరిచిపోయారా? ఇది ప్రజలను పచ్చిగా మోసం చేయడం కాదా? అధికార దుర్వినియోగంతో ఇసుకచుట్టూ ఒక మాఫియాను మీరు ఏర్పాటు చేయలేదా? భరించలేని రేట్లతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారా? లేదా?' అంటూ వైఎస్ జగన్ ప్రశ్నలు వేశారు.
- ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే టీడీపీ, కూటమి పార్టీలకు చెందిన నాయకులు ఇసుక నిల్వలపై కన్నువేశారని మాజీ సీఎం జగన్ తెలిపారు. అది నిజం కాదా? అని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం స్టాక్‌యార్డుల్లో ఉంచిన సుమారు 80 లక్షల టన్నుల్లో సగం ఇసుక మీ ప్రభుత్వం వచ్చి నెలరోజులు గడవకముందే ఎక్కడకు పోయిందని నిలదీశారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుక్షణం నుంచే టీడీపీ, ఆ కూటమికి చెందిన పార్టీలనేతలు దోచేయలేదా? అని ప్రశ్నించారు.
- 2014-19 మధ్య ప్రభుత్వ ఖజానాకు ఒక్క రూపాయి కూడా ఆదాయం రానీయకుండా పక్కా అవినీతి పథక రచనతో ఇసుకను దోచేసిన వ్యవహారం మళ్లీ ఇప్పుడు పునరావృతం అయ్యిందన్నదని వైసీపీ అధినేత జగన్ ఆరోపణలు చేశారు. ఎలాంటి చట్టబద్ధత లేకుండా ఉచిత ఇసుక పేరుతో ఒకే ఒక్క మెమో ఇచ్చి అప్పనంగా మీ మనుషులకు అప్పగించారని ఆరోపించారు. ఈ నది, ఆ నది అని తేడా లేకుండా ప్రతిచోటా ఇసుకను కొల్లగొట్టి వేలకోట్ల అవినీతికి పాల్పడ్డారని జగన్ విమర్శలు చేశారు.
- అధికారంలోకి వచ్చి 4 నెలలైనా స్పష్టమైన ఇసుక విధానం లేదని మాజీ సీఎం జగన్ గుర్తుచేశారు. చంద్రబాబు, ఆయన ముఠా చేతులమీదుగా ఇసుక దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. పాలసీని ప్రకటించకుండా ప్రజలంతా దసరా పండుగలో ఉంటే దొంగచాటుగా టెండర్లు పిలవడం నిజంకాదా చంద్రబాబు? అని ప్రశ్నించారు.
- తమ ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా ఇసుక విధానాన్ని అమలు చేసిందని జగన్ గుర్తుచేసుకున్నారు. దోపిడీలకు అడ్డుకట్టవేసి ఇటు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా, అటు వినియోగదారునికీ సరసమైన ధరకు అందించినట్లు వివరించారు. తమ ప్రభుత్వాన్ని నిరంతరం దుమ్మెత్తిపోసే పత్రికల్లో కూడా నియోజకవర్గాల వారీగా పారదర్శకంగా రేట్లపై ప్రకటనలు ఇచ్చామని జగన్ చెప్పారు. మరి మీ హయాంలో ప్రభుత్వానికి ఒక్క రూపాయి రావడం లేదన్నది వాస్తవం కాదా? అని మాజీ సీఎం జగన్ ప్రశ్నించారు. ఇసుక ఉచితమే అంటే వైఎస్సార్‌సీపీ హయాంలో కన్నా రేట్లు 2-3 రెట్లు ఎందుకు పెరిగాయి? మరి ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్తోంది చంద్రబాబు? అంటూ వైఎస్ జగన్ నిలదీశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి