కర్నూలు ప్రాంతానికి చెందిన ఆధ్యాత్మిక గురువు బాలసాయిబాబా ఈ రోజు ఉదయం హైదరాబాదులోని విరంచి ఆసుపత్రిలో మరణించారు. ఆశ్రమంలో ఉండగానే ఆయనకు నిన్న అర్థరాత్రి గుండెపోటు రావడంతో.. తనను  హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ రోజు ఉదయం ఆయన మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు ధ్రువీకరించాయి. 58 సంవత్సరాల బాల సాయిబాబా కర్నూలులో ఓ ట్రస్టు నడుపుతున్నారు. పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు బాల సాయిబాబాకి శిష్యులుగా ఉన్నారు. కేంద్ర మంత్రి రామ్ క్రిపాల్ యాదవ్ లాంటి వారు కూడా గతంలో బాలసాయిబాబా ఆశ్రమాన్ని సందర్శించడంతో ఆయన బాగా పాపులర్ అయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయినప్పటికీ ఆయనపై పలు  పత్రికలు గతంలో వివాదాస్పదమైన కథనాలు ప్రచురించాయి. నోటిలో నుండి శివలింగాలు తీసి భక్తులకు అందజేయడం బాలసాయిబాబా స్పెషాలిటీ. తనను తాను కమ్యూనిస్టు దేవుడినని ప్రచారం చేసుకున్న బాలసాయిబాబా గతంలో సాక్షాత్తు తిరుపతి వెంకటేశ్వరస్వామిపై కూడా ఆరోపణలు చేశారు.


కళింగ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా బాల సాయిబాబా పనిచేశారని గతంలో పలు వార్తలు వచ్చాయి. 14 జనవరి 1960 తేదిన కర్నూలులో జన్మించిన బాల సాయిబాబా తాను రమణ మహర్షి బోధనలతో ప్రభావితమై ఆధ్యాత్మిక రంగంలోకి వచ్చినట్లు పలుమార్లు తెలిపారు. కామన్వెల్త్ ఓకేషనల్ యూనివర్సిటీ నుండి బాలసాయిబాబా డాక్టరేటు పొందినట్లు ఆయన వెబ్ సైటులో పేర్కొనడం జరిగింది. బాలసాయిబాబా కర్నూలుతో పాటు హైదరాబాద్‌లో కూడా ట్రస్టును నిర్వహిస్తున్నారు. అలాగే పలు ఆలయాలు కూడా నిర్మించారు.