ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో శుక్రవారం ఆయన భేటీ కానున్నారు. ఈ  సమావేశంలోనే చంద్రబాబు సమక్షంలో కిషోర్ కుమార్  తెదేపా కండువా కప్పుకోనున్నారు. కిషోర్ కుమార్ తో పాటు ఆయన కుమారుడు అమర్నాథ్ రెడ్డి కూడా టీడీపీలో చేరనున్నట్టు సమాచారం.


నల్లారి కుటుంబానికి చిత్తూరు జిల్లా పీలేరులో గట్టి పట్టుంది. కానీ, గత మూడేళ్లుగా నల్లారి సోదరులు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజన తరువాత సమైక్యాంధ్ర పార్టీ స్థాపించినా.. ఆశించిన స్థాయిలో ఆ పార్టీకి ప్రజలకు చేరువ కాలేకపోయింది. ప్రస్తుతం కిరణ్ కుమార్ రెడ్డి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తిరిగి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతారా? లేదా? అనేది ప్రశ్నగానే ఉంది. ఇలానే ఆలోచిస్తూ కూర్చుంటే ఏమీ చేయలేమని కిషోర్ కుమార్ రెడ్డి భావించి, టీడీపీలో చేరుతున్నారు.