మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి 13వ తేదీనే చనిపోయారా ?
ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేసిన సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ
మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి ఆగస్టు 16నే చనిపోయారా లేక ఆయన చనిపోయారనే ప్రకటనను మాత్రమే ఆ రోజున చేశారా అని ఎన్డీఏ మాజీ మిత్రపక్షమైన శివసేన చేసిన ఆరోపణల నుంచి బీజేపీ ఇంకా తేరుకోకముందే.. తాజాగా వాజ్‌పేయి మృతిపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ పలు సందేహాలు వ్యక్తంచేశారు. బుధవారం విజయవాడలోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నారాయణ మాట్లాడుతూ.. వాజ్‌పేయి 13వ తేదీన రాత్రే చనిపోయినప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ఆ విషయాన్ని బయటికి పొక్కకుండా దాచిపెట్టారని ఆరోపించారు. నరేంద్ర మోదీ తన ముఖంలో ఆ బాధను ఏ మాత్రం కనిపించనివ్వకుండా ఆగస్టు 15న యధావిధిగానే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఎంతో హుషారుగా పాల్గొన్నారని నారాయణ అభిప్రాయపడ్డారు.
ఓవైపు ఎయిమ్స్ ఆస్పత్రిలో అటల్ బిహారి వాజ్‌పేయి శవంగా మారి ఉండగా, మోదీ మాత్రం అదేమీ పట్టనట్టు వ్యవహరించారని ఈ సందర్భంగా మోదీపై నారాయణ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మోదీ రాజకీయ దిగజారుడుతనానికి, ఆయన శవ రాజకీయాలకు ఇదో నిదర్శనమని నారాయణ ఆరోపించారు.