ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే హిజ్రాలకు పింఛన్లు మంజూరు చేసే యోచన ఉందని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మూడు రోజుల క్రితమే ఈ విషయమై ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అందులో మొదటి విడతలో గుంటూరు ప్రాంతంలో మూడు వేలమందికి రూ.1500 చొప్పున పింఛన్లు అందించమని అధికారులను ఆదేశించింది. 18 ఏళ్లు నిండిన హిజ్రాలందరూ ఈ పెన్షన్‌‌కు అర్హులే. అయితే ప్రభుత్వ డాక్టరు నుండి ధ్రువీకరణ పత్రం తీసుకొని, పింఛను ఆఫీసులో సమర్పించాకే.. పెన్షను మంజూరు అవుతుంది. కాగా ప్రస్తుతం వీటికి సంబంధించిన మార్గదర్శకాలు ఏవీ ప్రభుత్వ ఆసుపత్రులకు చేరకపోవడం గమనార్హం. పెన్షన్లు అందించాక హిజ్రాలకు ఉద్యోగ నియామకాలలో ప్రాధాన్యం కల్పించడంతో పాటు ఇళ్ల పట్టాలు, రేషన్‌కార్డులు కూడా అందిస్తామని గతంలో ప్రభుత్వం తెలిపింది.