గన్నవరం ఎయిర్పోర్టు సరికొత్త రికార్డు ; అతి తక్కువ వ్యవధిలో అత్యధిక ఆక్యుపెన్సీ !!
ఇప్పడిప్పుడే అంతర్జాతీయ శోభ సంతరించుకుంటున్న గన్నవరం ఎయిర్ పోర్టు సరికొత్త రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ సేవలు ప్రారంభమై 40 రోజుల్లోనే ఏకంగా 90 శాతానికిపైగా ఆక్యుపెన్సీ సాధించింది. గతేడాది డిసెంబరు 4న సేవలు ఆరంభం కాగా.. తొలి రోజు నుంచే డిమాండ్ పెరిగింది. అప్పటి నుంచి క్రమం క్రమంగా ఆక్యుపెన్సీ శాతం పెరుగుతూ వస్తోంది. జనవరి ఒకటో తేదీన ఇక్కడి నుంచి బయలుదేరిన విమానంలోని 180 సీట్లూ నిండిపోయాయంటే ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
సింగపూర్ విమానాలకు ఫుల్ డిమాండ్
ప్రయాణికులతో గన్నవరం విమానాశ్రయంలో కిక్కిరిసిపోతోంది. విజయవాడ నుంచి వివిధ రాష్ట్రాలు, విదేశాలకు వెళ్లే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ప్రధానంగా సింగపూర్ వెళ్లే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దీంతో ఇక్కడ సింగపూర్ వెళ్లే విమానాలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ప్రయాణీకుల రద్దీ దృష్టి లో పెట్టుకొని విమానయాన సంస్థ ఇండిగో వారంలో రెండు రోజులు సింగపూర్ సర్వీసులు అందిస్తోంది. ఇందులో భాగంగా మంగళ, గురువారాల్లో 180 సీట్ల సామర్థ్యం ఉన్న ఎ320 విమానాలను నడుపుతోంది. భవిష్యత్తు విమానాల సంఖ్య మరింత పెరగవచ్చని ఎయిర్ పోర్టు అధికారులు పేర్కొంటున్నారు.