పార్టీ మార్పు వార్తలపై స్పందించిన గంటా శ్రీనివాస రావు
ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటులో భాగంగా విశాఖపట్నంను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా చేస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రతిపాదనను స్వాగతిస్తున్నట్టు మాజీ మంత్రి, టీడీపీ నేత గంటా శ్రీనివాస రావు చేసిన ప్రకటన అనేక చర్చలకు, సందేహాలకు తావిచ్చింది.
విశాఖపట్నం: ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటులో భాగంగా విశాఖపట్నంను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా చేస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రతిపాదనను స్వాగతిస్తున్నట్టు మాజీ మంత్రి, టీడీపీ నేత గంటా శ్రీనివాస రావు (Ganta Srinivas Rao) చేసిన ప్రకటన అనేక చర్చలకు, సందేహాలకు తావిచ్చింది. ఓవైపు మూడు రాజధానుల ప్రతిపాదనను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా వ్యతిరేకిస్తోంటే... మరోవైపు అదే పార్టీకి చెందిన గంటా మాత్రం అనుకూల వ్యాఖ్యలు చేయడం ఏంటనే చర్చలు జరిగాయి. గంటా ప్రకటన అనంతరం ఆయన పార్టీ మారబోతున్నారనే ప్రచారం కూడా ఊపందుకుంది. టీడీపీని వీడి వైఎస్సార్సీపీలోకి వెళ్లేందుకు సిద్ధపడటం వల్లే గంటా అలాంటి ప్రకటన చేశారనేది ఆ ప్రచారం సారాంశం. అయితే, తాజాగా మీడియాతో మాట్లాడిన గంటా శ్రీనివాస రావు.. తాను పార్టీ మారుతున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. తనకు పార్టీ మారే ఉద్దేశమే లేదని గంటా శ్రీనివాస రావు తేల్చిచెప్పారు. తన వ్యాఖ్యలను కొంత మంది తప్పుగా అన్వయించుకుని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని గంటా అన్నారు.
Read also : గుంటూరు, కృష్ణా జిల్లాల ప్రజలతోపాటు అమరావతి రైతులకు వైసిపి నేతల హామీ
పార్టీ మార్పు వార్తలను ఖండిస్తూనే... అదే సమయంలో విశాఖపట్నంను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా చేస్తామన్న ఏపీ సర్కార్ ప్రకటనను గంటా శ్రీనివాస రావు మరోసారి స్వాగతించారు. గత 30 ఏళ్ల నుంచీ విశాఖ రాజకీయాలతో తనకు అనుబంధం ఉందని.. అందుకే విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ సిటీ చేస్తామనే ప్రకటనకు తాను అనుకూలమేనని అన్నారు. అయితే, అదే సమయంలో అమరావతి రాజధాని కోసం 33 వేల ఎకరాలను ఇచ్చి త్యాగం చేసిన అక్కడి రైతులకు కూడా అన్యాయం జరగకూడదని గంటా అభిప్రాయపడ్డారు. అలాగే విశాఖలోనూ ఇప్పటివరకు శాంతియుత వాతావరణం నెలకొని ఉందని.. రాజధాని రాకతో ఆ వాతావరణం చెడిపోతుందనే ఆందోళన కూడా విశాఖ వాసులను వెంటాడుతోందన్నారు. అందుకే విశాఖ వాసుల భయాందోళనలు తొలగించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందని గంటా గుర్తుచేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..