అమరావతి : ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదన తర్వాత తొలిసారిగా నేడు రాజధాని అమరావతి ప్రాంత పరిధిలోని వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నాయకులు సీఎం వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో అమరావతి నుంచి రాజధాని తరలింపు.. మూడు రాజధానుల ఏర్పాటు ప్రకటన అనంతరం చోటుచేసుకుంటున్న పరిణామాలు, రైతుల ఆందోళనలు వంటి అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే రాజధాని తరలింపులో తమ పార్టీ వైఖరి ఎలా ఉండబోతుందనే విషయాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులకు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
అమరావతి రైతులు, ఆందోళనకారులకు వైసిపి నేతల భరోసా..
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేసినప్పటి నుంచి ఆ ప్రాంతానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యేలపై రాజధాని గ్రామాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తమ ప్రజాప్రతినిధులు కనబడటం లేదంటూ వైసీపీ ఎమ్మెల్యేలపై అమరావతి ప్రాంత రైతులు సంబంధిత పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసి తమ నిరసన వ్యక్తంచేస్తున్నారు. అంతేకాకుండా శుక్రవారం కేబినేట్ భేటీ జరగనున్న నేపథ్యంలో నేడు జరిగిన భేటీలో అనేక అంశాలు ప్రస్తావనకొచ్చాయని వైసిపి నేతలు తెలిపారు. సమావేశం అనంతరం వైసిపి నేతలు కే పార్థసారథి, అంబటి రాంబాబు, మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ.. మూడు రాజధానుల ఏర్పాటుతో అమరావతి ప్రాంత ప్రజలకే కాదు.. కృష్ణా, గుంటూరు జిల్లాల వారికి కూడా ఎటువంటి నష్టం జరగదు అని స్పష్టంచేశారు. లక్షల కోట్లు వెచ్చించి నిర్మించనున్న రాజధానితో అభివృద్ధిని ఒక్క ప్రాంతానికే పరిమితం చేయొద్దని.. 13 జిల్లాల ప్రజలకు ఆ అభివృద్ధి ఫలాలు అందాలనే లక్ష్యంతోనే సీఎం వైఎస్ జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. అంతకు మించి సీఎం వైఎస్ జగన్‌కు ఏ ఒక్క ప్రాంతం మీదో లేక ఏ ఒక్క కులం మీదో కక్ష లేదని వైసిపి నేతలు పేర్కొన్నారు.
ఏపీ హోంమంత్రి సుచరిత, మోపిదేవి, బాపట్ల ఎంపీ నందిగామ సురేష్, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణ, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే ముస్తఫా, తాటికొండ ఎమ్మెల్యే శ్రీదేవి, పెద్దకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకరరావు, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు, విజయవాడ ఎమ్మెల్యే మల్లాది విష్టు, పార్థసారథి, దేవినేని అవినాష్ తదితర నాయకులు ఈ భేటీలో పాల్గొన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..