Konaseema Protest: గోదావరి జిల్లాలు అనగానే పచ్చని పైర్లు గుర్తుకువస్తాయి.. ప్రశాంత వాతావరణం కళ్లముందు కదలాడుతుంది. పచ్చని పంట పొలాల కళకళలాడే గోదావరి జిల్లాల ప్రజలకు వెటకారమే తప్ప కోపమే ఉండదంటారు. ఈ ప్రాంతంలో గొడవలు, అల్లర్లు చాలా తక్కువ. అలాంటి గోదావరి జిల్లాల్లో తుని ఘటన ఓ మచ్చలా మిగిలింది. 2016 జనవరి 31న తూర్పుగోదావరి జిల్లా తుని తగలబడింది. ఆందోళన కారుల హింసాకాండతో విలవిలలాడింది. కొన్ని గంటల పాటు జరిగిన అల్లర్లతో తునిలో భారీ విధ్వంసం జరిగింది. పోలీస్ స్టేషన్లపై దాడి జరిగింది. ఏకంగా రైలుకే నిప్పు పెట్టారు నిరసనకారులు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనమైంది. అరేళ్ల తర్వాత మళ్లీ అలాంటి ఘటనే జరిగింది. ఈ సారి ఆకుపచ్చని కోనసీమ మంటల్లో చిక్కుకుంది. అమలాపురం అగ్ని గుండమైంది. కోనసీమ వాసులను తీవ్ర భయభ్రాంతులకు గురి చేసింది. పరిస్థితిని కంట్రోల్ చేసేందుకు పోలీసులు కర్ఫ్యూ విధించాల్సిన పరిస్థితి తలెత్తింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2016 జనవరి ౩1న జరిగిన కాపు గర్జన సభ అదుపు తప్పి విధ్వంసానికి దారీ తీసింది. కాపులను బీసీ చేర్చాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి, కాపు సంఘం నేత ముద్రగడ పద్మనాభం ఈ నిరసనకు పిలుపిచ్చారు. తునిలో మధ్యాహ్నం రెండు గంటల తర్వాత సభ మొదలైంది. ముద్రగడ పిలుపుతో వేలాదిగా కాపులు తని తరలివచ్చారు. సభలో మాట్లాడిన ముద్రగడ.. మధ్యలోనే ఆపేశారు. అప్పటికప్పుడే రాస్తారోకో, రైలు రోకోకు పిలుపిచ్చారు. వేదిక దిగి ముందుకు కదిలారు. తనతో వచ్చేవాళ్లు రావాలని కోరారు. అంతే వేలాదిమంది అతనితో కలిసి ముందుకు నడిచారు. తన ఫ్యామిలీతో కలిసి జాతీయ రహదారిపై భైఠాయించారు ముద్రగడ పద్మనాభం. దీంతో నిరసకారులు అన్ని రోడ్లను దిగ్భందం చేశారు. తునిలోని రెండు పోలీస్ స్టేషన్లను ముట్టడించారు. విధ్వంసం చేశారు.


కొందరు నిరసనకారులు రైల్ రోకోకు దిగారు. తుని సమీపంలో ఉన్న రైలు పట్టాలపైకి వెళ్లారు. తుని- చేవూరు మధ్య పట్టాలపై కూర్చున్నారు. నిరసనకారులు పట్టాలపై ఉండగానే విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్తున్న రత్నాంచల్ ఎక్స్ ప్రెస్ వచ్చింది. నిరసనకారులు రాళ్ల దాడి చేయడంతో రైలును అక్కడే ఆపేశారు. రైలు డ్రైవర్ ను కిందకు దించి.. ఇంజిన్, బోగిలపై రాళ్ల దాడి చేశారు. కొందరు నిరసనకారులు రైలు బోగికి నిప్పు పెట్టారు. దీంతో ఒక్కసారిగా రైలులో మంటలు వచ్చాయి. ప్రయాణికులు హడలిపోయారు. రైలు దిగి పరుగులు తీశారు. ఆందోళనకారులు ఒక్కో బోగికి నిప్పు పెట్టడంతో నిమిషాల్లోనే రత్నాంచల్ ఎక్స్ ప్రైస్ మొత్తం అగ్నికి ఆహుతైంది. మంటలను ఆర్పేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. నిరసనకారులు భారీగా ఉండటం.. రాళ్ల దాడి చేస్తుండటంతో పోలీసులు ఏమి చేయలేకపోయారు. ఈ ఘటనలతో తుని అట్టుడికిపోయింది. ఈ ఘటన గుర్తుకు వస్తే తుని వాసులు ఇప్పటికి కలవరపడతారు. అంతటి విధ్వంసం జరిగింది 2016 జనవరి ౩1న.


ఆరేళ్ల తర్వాత 2022, మే 24న కోనసీమలో అలాంటే ఘటన జరిగింది. జిల్లా పేరు చిచ్చుతో అమలాపురం భగ్గుమంది. వేలాది మంది నిరసనకారులు కొన్ని గంటల పాటు అమలాపురంలో సైర్వవిహారం చేశారు. బస్సులను దగ్ధం చేశారు. ఏకంగా మంత్రి విశ్వరూప్ ఇంటిని తగలబెట్టారు. ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఇంటికి నిప్పు పెట్టారు. పోలీసులపైనా తిరగబడ్డారు. నిరసనకారుల దాడిలో అమలాపురం జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డితో పాటు 20 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు. కొత్తగా అమలాపురం కేంద్రంగా ఏర్పడిన జిల్లా పేరు వివాదమే ఇంతటి విధ్వంసానికి కారణమైంది. ఇటీవలే జిల్లాల విభజన చేసింది జగన్ ప్రభుత్వం. అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లాను ఏర్పాటు చేసింది. ఈ జిల్లాకు రాజ్యాంగ నిర్మాత డా  బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని ముందు నుంచి డిమాండ్లు వచ్చాయి. అన్ని పార్టీలు ఇదే ప్రతిపాదన చేశాయి. కాని ప్రభుత్వం మాత్రం కోనసీమ పేరుతోనే  జిల్లా ఏర్పాటు చేసింది. అంబేద్కర్ పేరు పెట్టకపోవడానికి నిరసనగా దళిత సంఘాలు ఆందోళనలు చేశాయి. దీంతో జిల్లా పేరు మారిస్తూ మే 18 కొత్త  ఉత్తర్వులు ఇచ్చింది ప్రభుత్వం. జిల్లా పేరును అంబేద్కర్ కోనసీమగా మార్చింది. ఇదే ఇప్పుడు రచ్చగా మారింది. కోనసీమ జిల్లా పేరు మార్చడాన్ని కొన్ని వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కోనసీమ జిల్లా సాధన జేఏసీ ఏర్పాటైంది. కొన్ని రోజులుగా నిరసనలు జరుగుతున్నాయి. మంగళవారం కలెక్టరేట్ వరకు ర్యాలీకి పిలుపిచ్చింది. ఆ ర్యాలీ తీస్తుండగానే నిరసన అదుపు తప్పింది. అమలాపురం తగలబడింది. దాదాపు 6 గంటల పాటు సాగిన విధ్వంసకాండతో కోనసీమ చిగురుటాకులా వణికిపోయింది. 2016లో జరిగిన తుని ఘటనతో.. ఈ పరిణామాలను పోలుస్తున్నారు గోదావరి ప్రజలు. ఈ రెండు ఘటనలు గోదావరి చరిత్రలో మచ్చగా మిగిలిపోతాయంటున్నారు. 


READ ALSO: Konaseema Protest: కర్ఫ్యూతో తగ్గిన ఉద్రిక్తత.. నివురుగప్పిన నిప్పులా కోనసీమ


READ ALSO: America Gun Fire:18 మంది విద్యార్థులు, ముగ్గురు టీచర్లు కాల్చివేత.. అమెరికాలో మరోసారి కాల్పుల మోత


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి