ఆంధ్రప్రదేశ్ లో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఉత్తర కోస్తాలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లాలలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వివరించింది. రానున్న 4 రోజులూ రాష్ట్రంలో పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చని అధికారులు తెలిపారు. ఒడిశాకు దగ్గరగా బలపడిన అల్పపీడనం.. ఉత్తర ఒడిశా వద్ద తీరాన్ని దాటిందన్న అధికారులు..ఈ నెల 19న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు తెలిపారు. భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు రావడంతో ఆయా జిల్లాల అధికారులు అప్రమత్తమయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రుతుపవనాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో సముద్రం చురుగ్గా ఉందని,  గంటకు 55-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. అలలు 4.4 మీటర్ల వరకు ఎగిసిపడనున్నట్లుగా వెల్లడించింది.


నైరుతి రుతుపవనాలు కోస్తాలో చురుగ్గా కదులుతుండగా.. రాయలసీమలో మాత్రం బలహీనంగా మారాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు వరరామచంద్రాపురంలో 9 సెం.మీ, కోయిడ, చింటూరు, వెలైరుపాడులో 8 సెం.మీ, పోలవరం, పెద్దాపురంలో 7, తునిలో 6, కుకునూరు, కొయ్యలగూడెం, చింతపల్లెలో 5 సెం.మీ వర్షపాతం నమోదైంది.


మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం, నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.