ఉత్తర కోస్తాకి భారీ వర్ష సూచన
ఉత్తరకోస్తా ప్రాంతాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలలో శుక్ర, శనివారాల్లో భారీ వర్షాలు పడే అవకాశం కనిపిస్తోంది.
ఉత్తరకోస్తా ప్రాంతాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలలో శుక్ర, శనివారాల్లో భారీ వర్షాలు పడే అవకాశం కనిపిస్తోంది. ఒరిస్సా ప్రాంతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావం వల్ల ఈ వానలు పడే అవకాశం ఉంది. భారత వాతావరణ విభాగం విడుదల చేసిన ఓ ప్రకటన ప్రకారం, ఉత్తర కోస్తాలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడనున్నాయని సమాచారం.
అలాగే రాయలసీయ ప్రాంతంలో కూడా పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కనుక ప్రజలు అప్రమత్తతతో వ్యవహరించాలని శాఖ పేర్కొంది.ఇటీవలే విశాఖలోని మన్యం ప్రాంతాల్లో పలుచోట్ల ఈదురుగాలుల వల్ల చెట్లు నెలకొరిగాయి. అలాగే మొట్టుజోరు గ్రామ సమీపంలో పిడుగులు కూడా పడ్డాయి. పాడేరు, డుంబ్రిగుడ, ముంచంగిపుట్టు, మైదానంలోని నర్సీపట్నం, రోలుగుంట మండలాల్లో కూడా ఈ మధ్యకాలంలో భారీగానే వర్షాలు పడ్డాయి.
ఈసారి కూడా కోస్తా ప్రాంతంలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ సూచించింది. తీర ప్రాంతాల్లో మత్స్యకారులు అప్రమత్తతతో వ్యవహరించాలని తెలిపింది.