ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిపై నటుడు శివాజీ సంచలన ఆరోపణలు చేశారు. ప్రత్యేక హోదా అంశంపై గురువారం గుంటూరులో నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివాజీ ప్రసంగిస్తూ  విభజన హామీలు, ప్రత్యేక హోదా లాంటి కీలక అంశాలపై మాట్లాడుతుంటే వెంకయ్యనాయుడికి కోపం ఎందుకు వస్తుందో అర్థకావడం లేదన్నారు. వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రానికి తాకట్టుపెట్టారని ఈ సందర్భంగా శివాజీ ఆరోపించారు. ఏపీని తాకట్టు పెట్టినందుగాను కేంద్రం ఆయనకు ఉపరాష్ట్రపతి పదవి ఆఫర్ చేసిందని విమర్శించారు. ఏపీకి న్యాయం కోసం రాష్ట్రానికి చెందిన ఎంపీలు పార్లమెంట్ ఉభయ సభలు స్తంభింపజేస్తే సగం విజయం సాధించినట్లేనని వ్యాఖ్యనించారు. మిగిలిన సగం జనం పూర్తి చేస్తారన్నారని వెల్లడించారు. 


గవర్నర్ పై గరం గరం
శివాజీ  ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ పై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన పెద్ద దరిద్రం గవర్నర్ నరసింహన్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి రాజకీయాలు చేస్తున్నారని.. ఏపీ ప్రయోజనాలు తనకేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారని హీరో శివాజీ  తీవ్ర వ్యాఖ్యలు చేశారు.