ప్రస్తుతం ఉత్తర కోస్తా నుంచి దక్షిణ ఒడిశా తీరం వరకూ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో సోమవారం నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇది తీవ్రమైతే తెలంగాణ, కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, రాయలసీమలో పలుచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కోస్తా తీరం వెంబడి గంటకు 45-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, 3.5 మీటర్ల నుంచి 3.8 మీటర్ల ఎత్తుతో అలలు ఎగసిపడతాయని పేర్కొంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో


ఏపీలో మరో మూడు రోజులపాటు వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో మరో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని, కోస్తా తీర ప్రాంతం వెంబడి బలమైన గాలులు వీస్తాయని,  సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు సముద్రంలోని చేపల వేటకు వెళ్లకూడదని వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది.


అల్పపీడన ప్రభావంతో శుక్ర, శనివారాల్లో కోస్తాలోని పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. రాకపోకలకూ అంతరాయం ఏర్పడింది. ప్రకాశం బ్యారేజీకి వరద తాకిడి పెరగడంతో.. గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


తెలంగాణలో


జార్ఖండ్ నుంచి ఒడిశా మీదుగా బంగాళాఖాతం వరకూ ఉపరితల ద్రోణి ఏర్పడిందని.. దీని ప్రభావంతో తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆదివారం తెలంగాణలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అటు గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తెలంగాణ రాష్ట్రంలోని వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పంట పొలాలు నీటమునిగాయి.