అలిగిన వంగవీటి రాధా ; బెజవాడలో ఉద్రిక్తత
విజయవాడ: విజయవాడ సెంట్రల్ టికెట్ వ్యవహారం ఉద్రిక్తతకు దారి తీస్తోంది. వంగవీటి రాధాకు విజయవాడ సెంట్రల్ టికెట్ పై జగన్ స్పష్టత ఇవ్వకపోవడంతో ఆయన అనుచరులు సోమవారం ఆందోళన బాట పట్టారు. ఈ క్రమంలో పట్టణంలోని పలు ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా బందర్ రోడ్డులోని వంగవీటి రంగా విగ్రహం వద్ద ఇద్దరు రాధా మద్దతుదారులు ఒంటిపై పెట్రోల్ పోసుకుని హల్ చల్ చేశారు. తమ నేతకు టికెట్ ఇస్తున్నట్లు ప్రకటించకుంటే ఆత్మహత్యకు పాల్పడతామని బెదిరించారు. చివరికి వంగవీటి రాధా అక్కడకు చేరుకుని కార్యకర్తలను వారించి తన వెంట తీసుకెళ్లారు
ఆదివారం విజయవాడలో జరిగిన వైసీపీ సమావేశంలో అధిష్టానం బెజవాడ సెంట్రల్ టికెట్ విషయంలో రాధాను కాదని.. మాల్లాది విష్ణు కు ఇచ్చేందుకు సముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆదే స్థానం కోసం పట్టుబడుతున్న వంగవీటి రాధాకు విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ వద్దని..బందర్ పార్లమెంటు నుంచి పోటీ చేయాలని పార్టీ అధిష్టానం సూచించినట్లుగా తెలుస్తోంది. దానికి ససేమీరా అన్న రాధా...తాను సెంట్రల్ నుంచి బరిలోకి దిగుతానని అధిష్టానానికి స్పష్టం చేశారు.
రాధా అభిప్రాయాన్ని బేఖాతరు చేస్తూ 'గడప గడపకూ వైసీపీ' కార్యక్రమాన్ని విజయవాడ సెంట్రల్ లో నిర్వహించే బాధ్యతను పార్టీ అధిష్ఠానం మల్లాది విష్ణుకు కట్టబెట్టడంపై రాధా మనస్తాపం చెందారు. ఈ నేపథ్యంలో వంగవీటి రాధా తన మద్దతుదారులతో కలిసి బందర్ రోడ్డులో రంగా విగ్రహంపై ఆందోళనకు దిగారు.