జగన్ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరవడంపై చంద్రబాబు నిర్ణయం ఇదేనా ?
జగన్ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరవడంపై చంద్రబాబు నిర్ణయం ఇదేనా ?
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తాను చేయనున్న ప్రమాణస్వీకారోత్సవానికి హాజరు కావాల్సిందిగా వైఎస్సార్సీపీ అధినేత జగన్ స్వయంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫోన్ చేసి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే, చంద్రబాబు ఈ కార్యక్రమానికి హాజరవుతారా లేదా అనే అంశంపైనే ఒకింత ఉత్కంఠ కొనసాగుతూ వచ్చినప్పటికీ.. బుధవారం ఉదయం జరిగిన టిడిపి నేతల సమావేశంలో దీనిపై ఓ స్పష్టత లభించినట్టు తెలుస్తోంది.
బుధవారం ఉదయం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలు చంద్రబాబును టిడిపిఎల్‌పి నేతగా ఎన్నుకున్న అనంతరం చంద్రబాబు ఈ విషయంపై ఓ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి తాను హాజరుకాకుండా.. తనకు బదులుగా ఇద్దరు టిడిపి సీనియర్ నేతలతో కూడిన ప్రతినిధి బృందాన్ని పంపాలని నిర్ణయించినట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఈ ఇద్దరు నేతలు గురువారం ఉదయం తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లి జగన్‌ను అభినందిస్తారని.. అనంతరం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆ ఇద్దరు టిడిపి నేతలు హాజరుకానున్నారనేది సదరు వార్తల సారాంశంగా తెలుస్తోంది.