Pawan Kalyan thanked PM Modi: పోరాడితే సాధ్యం కానిది ఏదీ లేదని రైతుల ఉద్యమంతో నిరూపితమైందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిప్రాయపడ్డారు. రైతుల పోరాటాన్ని రాజకీయ కోణం నుంచి కాకుండా ఒక సామాజిక అంశంగా పరిగణించి... సాగు చట్టాలను ఉపసంహరణకు నిర్ణయం తీసుకున్న బీజేపీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. రైతు చట్టాల ఉపసంహరణతో ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) రాజనీతిని ప్రదర్శించాడని కొనియాడారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ ట్విట్టర్‌లో ఓ లేఖను విడుదల చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని రూపొందించిన సాగు చట్టాలు (Farm laws) రైతుల ఆమోదం పొందలేకపోయాయని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఈ మూడు చట్టాలను ఉపసంహరిస్తామని ప్రకటించి మోదీ తన రాజనీతిజ్ఞతను చాటుకున్నారని అభిప్రాయపడ్డారు. గురునానక్ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగం ఆద్యంతం పరిశీలిస్తే జనవాక్కును శిరోధార్యంగా భావించారనే విషయం అర్థమవుతోందన్నారు. ఏడాది కాలంగా రైతులు చేసిన పోరాటానికి (Farmers protest) ఒక ఫలప్రదమైన ముగింపు లభించిందని... ఇది శుభపరిణామం అని పేర్కొన్నారు. ఎండనకా,వాననకా ఈ ఉద్యమాన్ని నడిపి... చివరకు సుప్రీం కోర్టును సైతం ఆశ్రయించిన రైతులకు, రైతు నాయకులకు మనస్పూర్తిగా అభినందనలు తెలుపుతున్నట్లు వెల్లడించారు.


 



అంతకుముందు, మరో ట్వీట్‌లో ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలపై (Heavy rains in AP) పవన్ కల్యాణ్ స్పందించారు. వరదల మూలంగా కడప జిల్లా చెయ్యేరులో 30 మంది గల్లంతవడం బాధాకరమన్నారు. చెయ్యేరులో కొట్టుకుపోయినవారి సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చునని స్థానికులు ఆందోళన చెందుతున్నట్లుగా తెలిపారు. శివాలయంలో దీపారాధకు వెళ్లిన భక్తులు, పూజారి వరద ప్రవాహంలో చిక్కుకుని గల్లంతయ్యారని పేర్కొన్నారు. అన్నమయ్య జలాశయం వద్ద వరద ఉధృతిని అధికార యంత్రాంగం ముందు గానే అంచనా వేసి.. ప్రజానీకాన్ని అప్రమత్తం చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు.


Also Read: ప్రధాని మోదీకి రైతుల షాక్... సాగు చట్టాల ఉపసంహరణపై వారి రియాక్షన్ ఇదే...


జల విలయంతో కడప, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల జనజీవనం అస్తవ్యస్తంగా మారిందన్నారు. రైతాంగానికి కోలుకోలేని నష్టం జరిగిందన్నారు.  తిరుపతి (Tiurpati) నగరంలో పలు కాలనీలు జలదిగ్భందంలో ఉన్నాయని... రహదారులు చెరువులను తలపిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే ప్రజలను వరదల నుంచి కాపాడేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రజల్లో భయాందోళనలు తొలగించేలా ఎప్పటికప్పుడు స్పష్టమైన సమాచారాన్ని వారికి చేరవేయాల్సిన అవసరం ఉందన్నారు. వరదల (Massive floods) కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రజలకు జనసేన నాయకులు, కార్యకర్తలు సాయంగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook