ప్రధాని మోదీకి రైతుల షాక్... సాగు చట్టాల ఉపసంహరణపై వారి రియాక్షన్ ఇదే...

Farmers reaction over repeal of farm laws: నూతన సాగు చట్టాలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనపై ఢిల్లీలోని సింఘు బోర్డర్ వద్ద ఆందోళన చేస్తున్న రైతులు స్పందించారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 19, 2021, 11:02 AM IST
  • సాగు చట్టాల ఉపసంహరణపై రైతుల స్పందన
    రద్దుపై అధికారిక ప్రక్రియ ప్రారంభమయ్యాకే ఆందోళనలు విరమిస్తామని ప్రకటన
    అప్పటివరకూ సింఘు బోర్డర్ నుంచి కదిలేది లేదన్న రైతులు
ప్రధాని మోదీకి రైతుల షాక్... సాగు చట్టాల ఉపసంహరణపై వారి రియాక్షన్ ఇదే...

Farmers reaction over repeal of farm laws: దాదాపు గత ఏడాది కాలంగా నూతన సాగు చట్టాలకు (Three farm laws) వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటానికి (Farmers protest) కేంద్ర సర్కార్ దిగి రాక తప్పలేదు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించారు. రైతులు ఇక ఆందోళనలు వీడి ఇంటిబాట పట్టాలని కోరారు. అయితే రైతులు మాత్రం ఇప్పుడప్పుడే నిరసన శిబిరాలను వీడే ఆలోచనలో లేరు. పార్లమెంటులో ఆ చట్టాల రద్దుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైన తర్వాతే నిరసన శిబిరాలను వీడుతామని ఢిల్లీలోని సింఘు బోర్డర్ వద్ద ఆందోళన చేస్తున్న రైతులు వెల్లడించారు.

'పార్లమెంటులో నూతన సాగు చట్టాల రద్దుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైన తర్వాతే రైతులు ఇక్కడి నుంచి వెళ్తారు.' అని సింఘు బోర్డర్‌లోని రైతులు తెలిపారు. ఓవైపు ప్రధాని మోదీ వ్యవసాయ చట్టాల రద్దుపై స్వయంగా ప్రకటన చేసి.. రైతులను ఆందోళన విరమించాల్సిందిగా విజ్ఞప్తి చేయగా... మరోవైపు రైతులు మాత్రం చట్టాల రద్దుకు (Farm laws) సంబంధించి అధికారిక ప్రక్రియ ప్రారంభమయ్యేంతవరకూ అక్కడి నుంచి కదిలేది లేదని చెప్తుండటం చర్చనీయాంశంగా మారింది.

దాదాపు ఏడాది కాలంగా రైతు చట్టాలపై ఏమాత్రం వెనక్కి తగ్గని కేంద్ర ప్రభుత్వం... ఉన్నట్టుండి వాటిని పూర్తిగా ఉపసంహరించుకోవడంపై చర్చ జరుగుతోంది. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్, పంజాబ్ సహా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) జరగనున్న నేపథ్యంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందనే వాదన బలంగా వినిపిస్తోంది. గతేడాది సెప్టెంబర్‌లో మూడు వ్యవసాయ చట్టాలు నిత్యావసర సరుకుల(సవరణ) చట్టం(The Essential Commodities (Amendment) Act), రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార(ప్రోత్సాహక, సులభతర) చట్టం(The Farmers' Produce Trade and Commerce Act), రైతుల (సాధికారత, రక్షణ) ధర హామీ, సేవల ఒప్పంద చట్టాలను (The Farmers Empowerment and Protection, Agreement of Price Assurance and Farm Services Act) కేంద్రం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. పార్లమెంటులో ఎటువంటి చర్చ జరగకుండానే ఈ చట్టాలు తీసుకురావడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. రైతుల ప్రయోజనం కోసమే ఈ చట్టాలు తీసుకొచ్చామని కేంద్రం పదేపదే చెప్పినప్పటికీ... రైతు లోకం మాత్రం తీవ్ర ఆందోళనలు చేపడుతూ వచ్చింది.

Also Read: మూడు నూతన సాగు చట్టాలను ఉపసంహరించుకుంటున్నాం': ప్రధాని మోదీ

రైతుల ఆందోళనలు (Farmers protest) ఉధృతమైన దరిమిలా ఆ మూడు చట్టాలను ఏడాది కాలం పాటు వాయిదా వేసేందుకు కేంద్రం ముందుకొచ్చింది. అయినప్పటికీ రైతులు ఆ ప్రతిపాదనకు అంగీకరించలేదు. చట్టాల రద్దే తమ ఏకైక ఎజెండా అని పలుమార్లు స్పష్టం చేశారు. కేంద్రంతో దాదాపు 11 దఫాలుగా జరిపిన చర్చల్లో ఇదే ఎజెండాను వినిపించారు. ఈ నెల 26తో రైతుల ఆందోళనలకు ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో మరోసారి ఛలో పార్లమెంటుకు (Parliament Sessions) రైతులు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ మార్చ్‌కు పెద్ద ఎత్తున జనసమీకరణ జరిపే ప్రయత్నాల్లో రైతు సంఘాలు ఉన్నాయి. ఇంతలోనే కేంద్ర ప్రభుత్వం సాగు చట్టాలను విరమించుకున్నట్లు ప్రకటన చేయడం గమనార్హం. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News