థర్డ్ ఫ్రంట్‌కు మద్దతు తెలిపిన పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ థర్డ్ ఫ్రంట్‌కు మద్దతు ఇచ్చారు.
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ థర్డ్ ఫ్రంట్‌కు మద్దతు ఇచ్చారు. టీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ఏర్పాటు చేయబోయే థర్డ్ ఫ్రంట్‌కు జనసేన పూర్తి మద్దతు ఇస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. పవన్ ప్రసంగ వీడియోను, పత్రాన్ని ఆదివారం ఆ పార్టీ కార్యాలయం మీడియాకు విడుదల చేసింది.
'ఏపీకి ప్రత్యేక హోదాపై స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు. తెలుగువారు ఎక్కడున్నా పరస్పరం గౌరవించుకోవాలి. హోదా ఇస్తామంటే ఇస్తామని చెప్పాలి, లేదంటే లేదని చెప్పాలని కేసీఆర్ చాలా బలంగా చెప్పడంతో హోదా కోసం పోరాడుతున్న వాళ్లకి, నాలాంటివాళ్లకి నైతికంగా కొండంత బలం ఇచ్చినట్లు అయ్యింది. ఏపీకి ప్రత్యేక హోదా కోసం మద్దతు తెలిపితే అక్కడి ప్రజలు తెలంగాణ హైకోర్టు కోసం అండగా ఉంటారు. వైజాగ్ రైల్వే జోన్ కోసం మద్దతు పలికితే.. తెలంగాణకు బయ్యారం ఉక్కుగనుల కోసం తోడుగా నిలుస్తారు.'
'దేశ రాజకీయాల్లో మూడో ప్రత్యామ్నాయం ఉండాలి. జాతీయ పార్టీలు రాష్ట్రాల ఆకాంక్షల్ని, అభివృద్ధిని విస్మరిస్తే ప్రాంతీయ పార్టీలు పుట్టుకొస్తాయి. కొత్త రక్తం రాజకీయాల్లో రావాలంటే థర్డ్ ఫ్రంట్ ఉండాలి. దీనికి అంకురార్పణ చేద్దామనుకున్న కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను..మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. మాజీ ముఖ్యమంత్రి అంజయ్య గారిని చులకన చేయడం వల్ల తెదేపా, రెండు పార్టీల మధ్య సమానత్వం చూపకపోవడం వల్ల టీఆర్ఎస్, విభజన సమయంలో అనుసరించిన ధోరణి వల్ల జనసేన పార్టీలు ఉద్భవించాయి’ అని పవన్ అన్నారు.