పవన్ కల్యాణ్‌కి భారీ షాక్ ఇచ్చిన జనసేన ఎమ్మెల్యే రాపాక
పవన్ కల్యాణ్‌కి భారీ షాక్ ఇచ్చిన జనసేన ఎమ్మెల్యే రాపాక
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు ఆ పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు భారీ షాక్ ఇచ్చారు. ఓవైపు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనపై పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ ట్విటర్ ద్వారా కామెంట్స్ చేస్తోంటే.. మరోవైపు అదే పార్టీకి చెందిన రాపాక వరప్రసాద్ మాత్రం సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి అందరినీ ఆశ్చర్యచకితులను చేశారు. వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం కింద ఆటోవాలాలకు ఏడాదికి 10వేల రూపాయల ఆర్థిక సాయం అందించే పథకాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇటీవలే ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌పై కృతజ్ఞతాభావంతో తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నల్లవంతెన సెంటర్‌లో సెంట్రల్ డెల్టా ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్స్ అందరూ కలిసి ఓ కార్యక్రమం నిర్వహించారు. ఆటో స్టాండ్‌లో సీఎం జగన్ ఫొటోకు పాలాభిషేకం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి రాజోలు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరపున గెలిచిన రాపాక వరప్రసాద రావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన రాపాక వరప్రసాద్.. ఆటోవాలాలకు అండగా నిలిచినందుకు సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. జనసేన పార్టీకి ఉన్న ఒక్కగానొక్క ఎమ్మెల్యే జగన్‌కి పాలాభిషేకం చేయడం చూస్తోంటే... త్వరలోనే ఆయన తన జెండా, అజెండా మార్చుకునేటట్టే కనిపిస్తోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. అదే కానీ జరిగితే, జనసేన పార్టీకి ఏపీ అసెంబ్లీలో పార్టీ తరపున ప్రాతినిథ్యం వహించేందుకు ఉన్న ఆ ఒక్క ఛాన్స్ కూడా పోయినట్టేననేది వారి భావన.