అమరావతి: ఏపీ రాజకీయాల్లో ఇటు వైఎస్ అటు చంద్రబాబు లాంటి దిగ్గజ నేతలకు సమకాలికుడైన జేసీ దివాకర్ రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకోబోతున్నారా ? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం చెప్పాల్సి ఉంది. ఈ ఉదయం ప్రెస్ మీట్‌లో జేసీ చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే ఆయన ఈ దిశగా ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది.  ప్రస్తుతం అనంతపురం టీడీపీ ఎంపీగా ఉన్న జేసీ వచ్చే ఎన్నికల్లో తనకు బదులు తన కుమారుడిని రంగంలో దించాలనే ఆలోచనను  బయటపెట్టారు. చంద్రబాబు ఓకే అంటే వచ్చే ఎన్నికల్లో తనకు బదులు తన కుమారుడు పవన్ కుమార్ రెడ్డి  అనంతపురం పార్లమెంట్ అభ్యర్దిగా పోటీ చేస్తాడని వెల్లడించారు. తన కొడుకుకు పార్లమెంట్‌కు వెళ్లాలన్న ఆసక్తి ఉందన్న జేసీ.. అతను కోరిన మేరకు తాను ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్లు వెల్లడించారు. జేసీ కోరికను చంద్రబాబు ఏ మేరకు అంగీకరిస్తారనే దానిపై ఉత్కంఠత నెలకొంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అన్న బాటలోనే తమ్ముడు...


అన్న జేసీ దివాకర్ రెడ్డి బాటలోనే జేసీ ప్రభాకర్ రెడ్డి పయనిస్తారని సమాచారం. ప్రస్తుతం తాడిపత్రి ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ..వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు అస్మిత్‌రెడ్డిని బరిలోకి దించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఇదే జరిగితే జేసీ కుటుంబం నుంచి యువ నాయకత్వం రంగంలోకి దిగినట్లవుతుంది.