అమరావతి: ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 100 రోజుల పరిపాలనపై టీడీపీ మాజీ ఎంపీ జేసి దివాకర్ రెడ్డి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ 100 రోజుల పాలనకు 100 మార్కులు వేయొచ్చన్న జేసి దివాకర్ రెడ్డి.. కాకపోతే వైఎస్ జగన్‌ను చేయిపట్టి నడిపించే వాడు కావాలి అని అన్నారు. ప్రతీ అంశాన్ని మైక్రోస్కోపులో చూసి సరిదిద్దాలి కానీ దాన్ని నేలకేసి కొట్టొద్దని జేసి అభిప్రాయపడ్డారు.


ఇక ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయడంపైనే ఒకింత అసహనం వ్యక్తంచేసిన జేసి దివాకర్ రెడ్డి.. ఆర్టీసి సిబ్బందికి ఇప్పటికే ఉద్యోగాలు ఉన్నాయని... వారికి కొత్తగా ఇచ్చేదీ ఏమీ లేదని చెబుతూ.. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు సృష్టించి, ఉపాధి కల్పిస్తే బాగుటుందని సూచించారు. ఇలాంటి సమయంలో ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయడం అంటే.. ఆర్టీసిని తెచ్చి ప్రభుత్వం నెత్తి మీద పెట్టుకోవడమే అవుతుందని జేసి వ్యాఖ్యానించారు. జేసి దివాకర్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ నేతలు ఏమని స్పందిస్తారో వేచిచూడాల్సిందే మరి.