తెలుగుదేశం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఈ రోజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉన్నప్పటికీ.. కాంగ్రెస్ పార్టీ గత్యంతరం లేక తమ పార్టీ మద్దతు కోరుతుందని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు టీడీపీ మద్దతు ఇస్తే తప్పేముందని ఆయన అన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ విషయంలో పరిస్థితి వేరని.. కాంగ్రెస్‌తో ఇక్కడ తమకు పొత్తు అవసరం లేదని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వాన్ని నమ్మి ఇప్పటికే ఏపీ ప్రజలు మోసపోయారని ఆయన వ్యాఖ్యానించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో తాము ఎవరితోనూ పొత్తు పెట్టుకోమని.. ఒంటరిగానే గెలుస్తామని ఆయన అన్నారు. అయితే తెలంగాణ విషయంలో పరిస్థితులను, ఆంధ్రప్రదేశ్‌లోని పరిస్థితులతో పోల్చలేమని ఆయన అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ముస్లిం ఓట్లు పడవని భయంగా ఉందని.. అందుకే ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారని జేసీ అభిప్రాయపడ్డారు. అలాగే పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్‌ఎస్ కచ్చితంగా బీజేపీకి మద్దతు ఇస్తుందని తెలిపారు. 


అలాగే కేంద్రంలో అధికారం మారాలని తాను కోరుకుంటున్నానని జేసీ అన్నారు. కేంద్రంలో అధికారం మారితేనే ఆంధ్రప్రదేశ్ తలరాత మారుతుందని.. తాము చేస్తున్న పోరాటాలకు ఒక అర్థం ఉంటుందని జేసీ అభిప్రాయపడ్డారు. ఏపీని విభజించి కాంగ్రెస్ తప్పు చేసినా సరే.. ప్రత్యేక హోదా ఇస్తామని చెబుతుంది కాబట్టి కాంగ్రెస్‌ను నమ్మి చూస్తే తప్పేమీ లేదని జేసీ తెలిపారు. ఇక పొత్తుల విషయానికి వస్తే.. ఎన్టీఆర్ నాటి పరిస్థితులు వేరు.. ఇప్పటి పరిస్థితులు వేరని.. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన ఉంటుందని జేసీ తెలిపారు.