అమరావతిలో బీజేపి దీక్ష శిబిరం వద్ద మీడియాపై దాడి.. ఉద్రిక్తత!
ఏపీ రాజధాని అమరావతి ప్రాంత రైతులకు మద్దతు తెలియజేస్తూ ఏపీ బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ నేడు ఒక్క రోజు మౌన దీక్ష చేపట్టారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం ఉద్దండరాయునిపాలెంలో ఎక్కడైతే ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారో.. అదే చోట నేడు కన్నా లక్ష్మీనారాయణ దీక్షకు దిగారు.
అమరావతి: ఏపీ రాజధాని అమరావతి ప్రాంత రైతులకు మద్దతు తెలియజేస్తూ ఏపీ బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ నేడు ఒక్క రోజు మౌన దీక్ష చేపట్టారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం ఉద్దండరాయునిపాలెంలో ఎక్కడైతే ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారో.. అదే చోట నేడు కన్నా లక్ష్మీనారాయణ దీక్షకు దిగారు. ఈ దీక్షలో భాగంగా కన్నా సుమారు గంటసేపు మౌనం వహించి నిరసన తెలిపారు. ఏపీకి చెందిన పలువురు బీజేపి నేతలు, ప్రజా సంఘాల నేతలు కన్నా దీక్షకు మద్దతు తెలుపులుతూ దీక్షలో పాల్గొన్నారు. ఏపీ సర్కార్‌కి వ్యతిరేకంగా చేపట్టిన ఈ దీక్షా వేదికపై నుంచే ఏపీ సర్కార్‌పై, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం జగన్ చేసిన మూడు రాజధానుల ప్రతిపాదనను ఓ మూర్ఖపు నిర్ణయంగా కన్నా అభివర్ణించారు. విశాఖపట్నంలో వైఎస్సార్సీపీ నేతలు ఇన్‌సైడ్ ట్రేడింగ్ చేశారని.. అందువల్లే రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించేందుకు కుట్ర చేస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు.
ఇదిలావుంటే, కన్నా లక్ష్మీనారాయణ దీక్షను కవర్ చేయడానికి అక్కిడికి వచ్చిన పాత్రికేయులలో ఒకరిద్దరిపై ఆందోళనకారులు దాడికి పాల్పడ్డారు. ఆందోళనకారుల దాడిలో పాత్రికేయులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒక పాత్రికేయురాలు కూడా ఉన్నట్టు సమాచారం. మీడియా వాహనాలపై సైతం ఆందోళనకారులు తమ ఆగ్రహాన్ని ప్రదర్శించారు. మీడియా సిబ్బంది వాహనాలపై కర్రలతో దాడికి పాల్పడి అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో కన్నా దీక్షా శిబిరం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.