కేంద్రం చేసిన ఆ ఒక్క పనికి లక్ష మంది ఉద్యోగాలు కోల్పోయారు : జూపూడి
కేంద్రంపై ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ విమర్శలు
ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం సాక్షర భారత్ పథకాన్ని రద్దు చేయడం వల్ల దేశవ్యాప్తంగా మొత్తం లక్ష మంది తమ ఉద్యోగాలు కోల్పోయారని ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ ఆరోపించారు. సాక్షర భారత్ పథకం రద్దు కారణంగా రాష్ట్రంలోనూ 20 వేల మంది ఉపాధి కోల్పోయారని జూపూడి విమర్శించారు. విజయవాడలో బుధవారం జూపూడి మీడియాతో మాట్లాడుతూ.. సాక్షర భారత్‌తో ఉన్న ప్రయోజనాలను వివరిస్తూ ఈ పథకాన్ని రద్దు చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం మూడుసార్లు కేంద్రాన్ని విజ్ఞప్తి చేసింది. అయినా కేంద్రం మాత్రం ఏపీ సర్కార్ సూచనలు చెవికి ఎక్కించుకోలేదు అని జూపూడి ఆవేదన వ్యక్తంచేశారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై మరిన్ని విమర్శలు గుప్పిస్తూ.. బిజెపి దొరలు ఇకనైనా రెండు నాల్కల ధోరణి వీడాలని హితవు పలికారు. చంద్రబాబు నాయుడు వల్లే రాష్ట్రం అభివృద్ధి చెందడం లేదని ఆరోపిస్తున్న బీజేపీ రాష్ట్ర నేతలకు దమ్ముంటే వెళ్లి కేంద్రాన్నే నిలదీయాలని ఏపీ బీజేపీ నేతలకు జూపూడి సవాల్ విసిరారు.