హైకోర్టు సీజేగా జస్టిస్ రాధాకృష్ణన్ నియామకం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ టి.బి. రాధాకృష్ణన్ నియామకమయ్యారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ టి.బి. రాధాకృష్ణన్ నియామకమయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం ఆదివారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాధాకృష్ణన్ ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండగా.. బదిలీపై ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియామకమయ్యారు. ఒకట్రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ జస్టిస్ రాధాకృష్ణన్‌తో ప్రమాణం చేయించనున్నారు. 2016 ఆగస్టు నుంచి ఉమ్మడి హైకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే)గా జస్టిస్ రమేశ్ రంగనాథన్ బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఏకే త్రిపాఠీ ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
జస్టిస్ రాధాకృష్ణన్ నేపథ్యమిదీ..
కేరళ రాష్ట్రానికి చెందిన జస్టిస్ రాధాకృష్ణన్ బెంగళూరు వర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా అందుకొని 1983 డిసెంబరు 11న న్యాయవాదిగా పేరు రిజిస్టర్ చేసుకున్నారు. జూనియర్ న్యాయవాదిగా తిరువనంతపురంలో వృత్తి జీవితాన్ని మొదలుపెట్టారు. సివిల్, రాజ్యాంగం, అడ్మినిస్ట్రేటివ్ ‘లా’కు సంబంధించిన కేసుల్లో పేరు గడించారు. కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా 2004లో నియమితులై..అక్కడే 2016లో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి.. పదోన్నతిపై 2017 ఫిబ్రవరిలో ఛత్తీస్‌గఢ్ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఛత్తీస్‌గఢ్ సీజేగా పనిచేస్తూ తాజాగా ఉమ్మడి హైకోర్టుకు సీజేగా బదిలీపై రానున్నారు.