కత్తి మహేష్, పవన్ ఫ్యాన్స్ కథ సమాప్తం ..!
సినీ విమర్శకుడు కత్తి మహేష్ ఎట్టకేలకు ఓ నిర్ణయానికి వచ్చారు. తాజాగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పై తాను పెట్టిన కేసును ఆయన వెనక్కు తీసుకున్నారు.
సినీ విమర్శకుడు కత్తి మహేష్ ఎట్టకేలకు ఓ నిర్ణయానికి వచ్చారు. తాజాగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పై తాను పెట్టిన కేసును ఆయన వెనక్కు తీసుకున్నారు. గురువారం కొందరు ఫ్యాన్స్ ఆయనపై కోడిగుడ్లతో దాడి చేసిన క్రమంలో ఆయన మాదాపూర్ పోలీసు స్టేషనులో కంప్లైంట్ ఇచ్చారు. ఆ తర్వాత సీసీటీవీ ఫుటేజీని చూసిన పోలీసులు.. కారకులను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత చాలా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.
కొందరు ఫ్యాన్స్ వచ్చి కత్తి మహేష్‌తో మాట్లాడిన తర్వాత ఆయన స్టేషనుకి వచ్చి ఫిర్యాదును వాపసు తీసుకుంటున్నానని తెలిపారు. ఆ దాడి చేసిన వ్యక్తుల్లో ఓ దళితుడు కూడా ఉన్నారని.. తన అభిమతం ఒక సంస్కరణను తీసుకురావాలనే తప్ప.. యువతపై కేసును నమోదు చేయడం కాదని..తాను మనిషిగా ఎదగాలని భావిస్తున్నాను కాబట్టి కేసు వెనక్కు తీసుకుంటున్నానని తెలిపారు. ఈ క్రమంలో కొందరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వచ్చి కత్తి మహేష్‌తో సెల్ఫీ తీసుకున్నారు. ఆ తర్వాత ఆయనకు స్వీట్స్ తినిపించి.. శాలువా కప్పి సన్మానించారు.
"నా పైన దాడి చేసిన పరిపక్వత లేని, పేద, భ్రమిత పవన్ కళ్యాణ్ అభిమానులను శిక్షించడం నా ఉద్దేశం కాదు. ఆ ఇద్దరిలో ఒక దళితుడు ఉండటం కడు శోచనీయం. పవన్ కళ్యాణ్ & జనసేన ఇప్పుడిప్పుడే నేను ఆశించిన దిశగా అభిమానులకు, శ్రేణులకు మార్గదర్శకాలు ఇవ్వడం మొదలుపెట్టారు. ప్రవర్తనా నియమావళి అందించారు.స్పందిస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో గైడెన్స్ లేని పిచ్చి అభిమానంతో నాపై దాడిచేసిన వారిని శిక్షించడానికి కాకుండా వారిని సంస్కరించడానికి నేను నైతికంగా బద్ఢుడను. అందుకే కేసును ఉపసంహరించుకుంటున్నాను. ఇక, నాపై దాడిని ఖండించడం, క్షమాపణలు చెప్పడం పవన్ కళ్యాణ్ విజ్ఞతకే వదిలేస్తున్నాను" అని ఈ సందర్భంగా కత్తిమహేష్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఈ ప్రకటన చేశాక.. మహేష్ ఇక తాను ఎవరినీ పర్సనల్‌గా విమర్శించనని.. కాకపోతే సినిమాలపై, రాజకీయ పరిస్థితులపై తన అభిప్రాయాలు మాత్రం కొనసాగుతాయని తెలిపారు.