సినీ క్రిటిక్ కత్తిమహేష్‌ను మళ్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవలే శ్రీరాముడి మీద అభ్యంతకర వ్యాఖ్యలు చేసినందుకు కత్తి మహేష్‌ను తెలంగాణ పోలీసులు హైదరాబాద్ నగరం నుండి బహిష్కరించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మహేష్ తన స్వగ్రామమైన చిత్తూరు వెళ్లిపోయారు. ఈ మధ్యకాలంలో చిత్తూరులో ఎస్సీ, ఎస్టీ బహుజన సంఘాల ఆధ్వర్యంలో సింహగర్జన కార్యక్రమం ఏర్పాటు చేయాలని పలువురు భావించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ క్రమంలో ఈ సింహగర్జన కార్యక్రమానికి సంబంధించి ప్రెస్ మీట్ నిర్వహించాలని సంకల్పించారు. ఆ ప్రెస్ మీట్‌లో పాల్గొనేందుకు కత్తి మహేష్‌ కూడా చిత్తూరు జిల్లా పీలేరుకు వచ్చారు. కానీ కత్తి మహేష్ మాట్లాడితే మళ్లీ శాంతి భద్రతల సమస్య ఎదురయ్యే అవకాశం ఉందని చెబుతూ.. ఆయనను పీలేరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతన్ని జీపులో మదనపల్లి వైపు తీసుకెళ్లారు. 


ఎస్సీ, ఎస్టీ కేసులు, చట్టాలను 9వ షెడ్యూల్‌లో చేర్చాలని గత కొంతకాలంగా ఒక డిమాండ్ అనేది వస్తోంది. ఈ డిమాండ్‌కు సంబంధించే ప్రెస్ మీట్ నిర్వహించడానికి పలువురు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. కత్తి మహేష్ కూడా ఈ మధ్యకాలంలో దళిత సమస్యల పై గట్టిగా స్పందిస్తున్నారు. "కాలా" సినిమా విడుదల అయినప్పుడు కూడా అందులో రజనీకాంత్ పాత్ర  దళితులకు ప్రాతినిధ్యం వహించే పాత్రను పోలి ఉందనే వాదన వచ్చినప్పుడు.. పలు టీవీ ఛానళ్లు నిర్వహించిన చర్చల్లో కత్తి మహేష్ కూడా పాల్గొన్నారు.


ఒకప్పుడు సినీ క్రిటిక్‌గా పలువురికి తెలిసిన కత్తి మహేష్.. బిగ్ బాస్ షోకి వెళ్లి వచ్చిన తర్వాత మరింత పాపులర్ అయ్యారు. పవన్ కళ్యాణ్‌ను తూలనాడారని చెబుతూ అనేక మంది పవన్ ఫ్యాన్స్ కత్తి మహేష్‌కి ఫోన్ చేసినప్పుడు.. ఆయన పవర్ స్టార్ ఫ్యాన్స్‌కి వ్యతిరేకంగా పోరాడతానని చెబుతూ వార్తలలో నిలిచారు.