విజయవాడ: తెలుగుదేశం పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమే కాకుండా ఇకపై తాను రాజకీయాలకు దూరంగా ఉండదల్చుకున్నానని ప్రకటించిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కన్విన్స్ చేసేందుకు ఆ పార్టీ నేతలు ఇంకా ఆయనతో చర్చలు జరుపుతూనే ఉన్నారు. అందులో భాగంగానే తాజాగా విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా గురువారం వల్లభనేని వంశీతో మూడు గంటలపాటు భేటీ అయ్యారు. పార్టీని వీడి ఎక్కడికీ వెళ్లవద్దని, కష్టకాలంలో అధినేత చంద్రబాబు అండగా ఉంటారని వంశీకి ధైర్యం చెప్పారు. రాజకీయాలు వీడినంత మాత్రాన్నే సమస్యలన్నీ తొలగిపోతాయని భావించొద్దని కేశినేని సూచించినట్టు తెలుస్తోంది. వంశీతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఎంపీ కేశినేని నాని.. వంశీకి చెప్పాల్సిందంతా చెప్పామని, ఇక నిర్ణయం తీసుకోవడం వంశీ చేతుల్లోనే ఉందన్నారు. వంశీకి తెలుగుదేశం పార్టీ ఎంత అవసరమో.. పార్టీకి కూడా వంశీ అంతే అవసరమని నాని స్పష్టంచేశారు. వంశీ ఇంకా ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలోనే ఉన్నారని, అంతిమ నిర్ణయం ఏంటో చెప్పాల్సింది ఆయనేనని కేశినేని తెలిపారు.
 
పలు కేసులు, ఇతర సమస్యల నుంచి ఊరట పొందడానికే వల్లభనేని వంశీ రాజకీయాలకు దూరంగా ఉంటామంటున్నారు కదా అనే ప్రశ్నకు స్పందించిన నాని.. కుటుంబంలో, వ్యాపారాల్లో ఉన్నట్లే రాజకీయాల్లోనూ కొన్ని సమస్యలుంటాయని, రాజకీయంగా రాటుదేలాలంటే అవి భరించకతప్పదని అభిప్రాయపడ్డారు. ఇలా పారిపోవడం మొదలు పెడితే.. ఇక జీవితాంతం పారిపోవాల్సి వస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని వంశీని పరోక్షంగా హెచ్చరించారు. నియోజకవర్గంలో ప్రత్యర్థులతో వీరోచితంగా పోరాడి గెలిచిన వంశీ.. ఇప్పుడిలా వెన్ను చూపడం మంచిది కాదని వంశీకి హితవుపలికారు.