Kodela Sivaram Slams Chandrababu Naidu: సత్తెనపల్లి : టీడీపీలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన దివంగత నేత, ఏపీ మాజీ స్పీకర్, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన కోడెల శివ ప్రసాద రావు కుటుంబం అదే టీడీపీపై సంచలన ఆరోపణలు చేసింది. కోడెల కుటుంబానికి పార్టీలో అన్యాయం జరుగుతోంది అని కోడెల శివ ప్రసాద రావు కుమారుడు కోడెల శివరాం ఆరోపించారు. గురువారం సత్తెనపల్లి టీడీపీ కార్యాలయంలో తన మద్దతుదారులతో కలిసి మీడియాతో మాట్లాడిన కోడెల శివరాం.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుపై, పార్టీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.  కోడెల శివ ప్రసాద రావు కుటుంబంపై కొంత మంది టీడీపీ నాయకులు కుట్ర చేస్తున్నారు అని ఆరోపించారు. కోడెల శివ ప్రసాద్ మరణం తర్వాత తండ్రిలాగా తమ కుటుంబానికి అండగా ఉంటాం అని హామీ ఇచ్చిన చంద్రబాబు... నేడు కోడెల కుటుంబానికి మాట్లాడేందుకు 5 నిముషాలు కూడా సమయం ఎందుకు ఇవ్వడం లేదు అని ప్రశ్నించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగు దేశం పార్టీ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసిన కోడెల శివ ప్రసాద్ కుటుంబం ఇప్పుడు పార్టీలో వివక్షతకు గురవుతోంది అని కోడెల శివరాం ఆవేదన వ్యక్తంచేశారు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడును తిట్టిన, చంద్రబాబు హెరిటేజ్, ఆస్తులపై సిబిఐ చేత విచారణ జరిపించాలి అని పిర్యాదు చేసిన కన్నా లక్ష్మి నారాయణను సత్తెనపల్లి టీడీపీ ఇంచార్జిగా ప్రకటించడం ఎంతవరకు సమంజసం అని చంద్రబాబు నాయుడిని నిలదీశారు. 


తన తండ్రి అయిన కోడెల శివ ప్రసాద రావు మరణించిన సమయంలో ఆయన పార్థివదేహానికి అధికార లాంచనలతో అంత్యక్రియలు జరిపించేందుకు వైసీపీ ప్రభుత్వం ముదుకొచ్చినప్పటికీ.. ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను తిరస్కరించాల్సిందిగా తెలుగు దేశం పార్టీ తనను ఆదేశించింది. ఒక కొడుకుగా ప్రభుత్వ లాంచనలతో గౌరవంగా కోడెల శివప్రసాద్ అంత్యక్రియలు నిర్వహించాలని కోరుకున్నప్పటికీ.. కేవలం పార్టీ ఆదేశాలకు కట్టుబడి ఆరోజు ప్రభుత్వ లాంచనలను తిరస్కరించాను. అందుకు తెలుగు దేశం పార్టీ ఇచ్చే బహుమతి ఇదేనా అని కోడెల శివరాం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి ప్రశ్నించారు. 


తెలుగు దేశం పార్టీకి కట్టుబడి ఉన్న కోడెల శివప్రసాద్ కుటుంబంపై గత నాలుగేళ్లుగా ఏవేవో కుట్రలు చేస్తూనే ఉన్నారని కోడెల శివరాం మండిపడ్డారు. ఏదేమైనా పార్టీ కోసం ఎంతో కృషి చేసిన కోడెల శివప్రసాద్ కుటుంబానికి పార్టీలో సరైన గౌరవం, గుర్తింపు ఇవ్వాలని కోరుతున్నాను అని పార్టీని విజ్ఞప్తి చేశారు. ఒక్కో నియోజకవర్గంలో తమ బలం పెంచుకుంటూ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని కసి మీదున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీపై కోడెల శివరాం చేసిన వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే మరి.