Konaseema district violence Updates: ఏపీలోని వేరే జిల్లాలకు ఎన్టీఆర్, వైఎస్సార్, అల్లూరి, అన్నమయ్య, పొట్టి శ్రీరాములు, ప్రకాశం గార్ల పేర్లు పెట్టినప్పుడు లేని అభ్యంతరం రాజ్యాంగ నిర్మాత అయిన డా బిఆర్ అంబేడ్కర్ పేరు పెడితేనే ఎందుకు వస్తోందని ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ ప్రశ్నించారు. కోనసీమలో విధ్వంసం ఘటనలపై స్పందించిన మంద కృష్ణ మాదిగ.. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరును వ్యతిరేకించడం సిగ్గు చేటు అని ఆవేదన వ్యక్తంచేశారు. అంతేకాకుండా మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ ఇళ్ల మీద దాడికి పాల్పడి నిప్పుపెట్టడం హేయమైన చర్యగా అభివర్ణించారు. ఈ దాడి వెనుక అరాచక శక్తులు ఉన్నాయని.. దాడికి బాధ్యులైన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంద కృష్ణ మాదిక మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రపంచ వ్యాప్తంగా గొప్ప మేధావిగా పేరొందిన డా. బిఆర్ అంబేద్కర్ పేరును కోనసీమ జిల్లాకు పెట్టడాన్ని కొన్ని అరాచక శక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయని.. వాళ్లే ఈ విధ్వంసం సృష్టిస్తున్నారని మంద కృష్ణ మాదిక మండిపడ్డారు. కోనసీమలో విధ్వంసాలకు పాల్పడిన వారితో పాటు.. వారి వెనుక ఉన్న అరాచక శక్తులను తక్షణమే గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. కోనసీమ జిల్లాకు డా బి. ఆర్. అంబేద్కర్ పేరు పెట్టాలని స్థానికంగా ఉన్న అన్నివర్గాల ప్రజలు, దళిత సంఘాలు, రాజకీయ పార్టీలు కూడా డిమాండ్ చేశాయి. అలాంటిది ఇప్పుడు అంబేద్కర్ పేరు పెట్టిన తరువాత ఆ పేరును వద్దని వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేయడం, ఇలా విచక్షణ లేకుండా ఆస్తుల విధ్వంసాలకు పాల్పడడం చూస్తోంటే దీని వెనుక అరాచక శక్తుల హస్తం ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది అని అన్నారాయన. 


కోనసీమ విధ్వంసం ఉదంతం వెనుక భయంకరమైన కుట్రలు జరుగుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఏపీ సర్కారు వెంటనే ఈ కుట్రలకు బాధ్యులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం అని మంద కృష్ణ మాదిగ తెలిపారు. ఇతర జిల్లాలకు ఇతర సామాజిక సంఘ సంస్కర్తలు, ప్రముఖుల పేర్లు పెడితే లేని ఇబ్బంది ఒక్క అంబేద్కర్ విషయంలోనే ఎందుకు వస్తుందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కుల ఉన్మాదంతో రాజ్యాంగ నిర్మాతను అవమానించడం తగదు అని ఆయన అరాచక శక్తులకు హితవు పలికారు. ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న అంబేద్కర్ పేరు పెట్టడం వల్ల కోనసీమ జిల్లాకు గౌరవం పెరుగుతుందే తప్ప ఆవగింజంత కూడా తగ్గదనే విషయాన్ని కోనసీమ ప్రజలు గుర్తించాలని కోరుతున్నాం అని అన్నారు.


ఆంధ్రప్రదేశ్ సర్కారు తక్షణమే స్పందించి అమలాపురంలో మంత్రి విశ్వరూప్, కోనసీమ జిల్లా వైసీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే సతీష్ పొన్నాడ నివాసాల మీద దాడులకు పాల్పడిన వారిని తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. కొంతమంది అరాచక శక్తుల దౌర్జనాలకు భయపడి కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు (Konaseema, Amalapuram violence) విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గితే దళితులు, పీడితవర్గాలు సహించరనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని మంద కృష్ణ మాదిగ హెచ్చరించారు.


Also read : Konaseema Tension:కోనసీమ ఉద్రిక్తత, సంయమనం పాటించాలన్న పవన్ కల్యాణ్


Also read : Konaseema Violence: అట్టుడుకుతున్న కోనసీమ.. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ ఇళ్లకు నిప్పంటించిన ఆందోళనకారులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.