Michaung Cyclone: తీవ్రరూపం దాలుస్తున్న మిచౌంగ్ తుపాను, భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం
Michaung Cyclone: మిచౌంగ్ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, తిరుపతి, ఎన్టీఆర్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. తీర ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ అయింది. పలు రైళ్లు, విమానాలు రద్దయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Michaung Cyclone: బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుపాను తీవ్రరూపం దాలుస్తోంది. ఏపీ, తమిళనాడుపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. చెన్నై పరిసర జిల్లాలు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమౌతున్నాయి. తీర ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మిచౌంగ్ తుపాను ప్రభావం ఏపీపై తీవ్రంగా ఉండనుందనే హెచ్చరికలు జారీ అయ్యాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుపాను కోస్తాంద్రకు మరింత చేరువైంది. ప్రస్తుతం నెల్లూరుకు 200, బాపట్లకు 290, మచిలీపట్నానికి 310 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. కాసేపట్లో తీవ్ర తుపానుగా మిచౌంగ్ మారనుంది. రేపు మధ్యాహ్నం నిజాంపట్నం వద్ద తీరం దాటనుందని ఐఎండీ వెల్లడించింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. ఇప్పటికే నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, తిరుపతి, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు రాత్రి నుంచి పడుతున్నాయి. రేపు, ఎల్లుండి అతి భారీ వర్షాలు పడవచ్చని ఐఎండీ హెచ్చరించింది. ఇప్పటికే నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
తుపాను కారణంగా ఇప్పటికే ఐదు విమానాలు రద్దయ్యాయి. పలు రైళ్లను సైతం రద్దు చేశారు. మిచౌంగ్ తుపాను ప్రభావంతో చెన్నైలో సైతం భారీ వర్షాలు పడుతుండటంతో రైల్వే ట్రాక్, స్టేషన్‌లో కూడా నీళ్లు చేరాయి. దాంతో పలు రైళ్లు రద్దయ్యాయి. చెన్నై సమపీంలో తిరుముల్లాయ్ వోయల్, అన్నానూర్, తాంబరం ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరింది.
తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయానికి రావల్సిన స్పైస్‌జెట్, ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాలను దారి మళ్లించడంతో ప్రయాణీకులు సమాచారం లేక పడిగాపులు కాస్తున్నారు. భారీ వర్షాల కారణంగా తిరుపతి జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొన్నిప్రాంతాల్లో రోడ్లపై నుంచి నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు కూడా స్థంభించిపోయాయి. మిచౌంగ్ తుపాను తీరానికి చేరువయ్యే కొద్దీ వర్షాల తీవ్రత పెరుగుతోంది. గాలుల వేగం అధికమౌతోంది.
Also read: Michaung Cyclone: దూసుకొస్తున్న మిచౌంగ్ తుపాను, ఏపీలో దంచి కొడుతున్న భారీ వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook