Michaung Cyclone Alert: ఏపీలో మిచౌంగ్ తుపాను బీభత్సం, జిల్లాల్లో రెడ్, ఆరెంజ్, ఎలర్ట్ జారీ
Michaung Cyclone Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుపాను ఏపీలో బీభత్సం సృష్టిస్తోంది. రాష్ట్రంలో కోస్తా తీరం వెంబడి జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు సైతం నమోదవుతున్నాయి. ఏపీలో మిచౌంగ్ తుపాను ప్రభావం ఏ జిల్లాలో ఎలా ఉందో తెలుసుకుందాం.
Michaung Cyclone Alert: మిచౌంగ్ తుపాను తీవ్ర తుపానుగా మారి ఏపీని అతలాకుతలం చేస్తోంది. గంటకు 7-8 కిలోమీర్ల వేగంతో పయనిస్తూ తీరానికి మరింత చేరువైంది. తీరానికి చేరువయ్యే కొద్దీ గాలులు, వర్షాల తీవ్రత కూడా పెరుగుతోంది. తీరం దాటే సమయంలో ఆ ప్రాంతంలో పరిస్థితి ఊహించినదానికంటే భయంకరంగా ఉండవచ్చని ఐఎండీ హెచ్చరిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుపాను ప్రస్తుతం నెల్లూరుకు 40-50 కిలోమీటర్ల దూరంలో చెన్నైకు 190, బాపట్లకు 110, మచిలీపట్నానికి 180 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుపాను కారణంగా ఇప్పటికే సముద్రమంతా అల్లకల్లోలంగా మారింది. తీరం దాటే సమయంలో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయని ఐఎండీ అంచనా వేస్తోంది. మిచౌంగ్ తుపాను కారమంగా ఏపీలోని 9 జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. బాపట్ల, ప్రకాశం, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, పశ్చిమ గోదావరి, ఏలూరు, కోనసీమ జిల్లాలపై ప్రభావం ఎక్కువగా ఉండనుండటంతో రెడ్ అలర్ట్ జారీ అయింది. ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.
ఇక నెల్లూరు, కడప, తూర్పు గోదావరి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ఇక మిగిలిన 8 జిల్లాలైన తిరుపతి, నంద్యాల, అన్నమయ్య, అనకాపల్లి, మన్యం, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది.
వర్షపాతం వివరాలు
కోనసీమలో 86, కృష్ణా జిల్లాలో 55, బాపట్లలో 64, నెల్లూరులో 55, చిత్తూరులో 93 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తిరుపతి జిల్లా కోటలో అత్యధికంగా 388 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇదే జిల్లాలో మనబోలులో 366, చిల్లకూరులో 350, నాయుడు పేటలో 271, బలయపల్లిలో 239, సైదాపురంలో 223, వెంకటాచలంలో 213 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
మచిలీపట్నం పోర్టులో అత్యంత ప్రమాదకరమైన 10వ నెంబర్ హెచ్చరిక కూడా జారీ అయింది. కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్డులో వాహనాల రాకపోకలు నిలిపివేశారు. కృష్ణపట్నం పోర్టులో కూడా 10వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ అయింది.
Also read: Michaung Cyclone: మిచౌంగ్ తీవ్రరూపం, బాపట్ల వద్ద మద్యాహ్నం తీరం దాటనున్న తుపాను
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook