ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో చిన్న అపశృతి చోటుచేసుకుంది. ఈ ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న జగన్.. నేడు శ్రీకాళహస్తిలో పాదయాత్ర చేపట్టారు. జగన్ పాదయాత్ర నేపథ్యంలో శ్రీకాళహస్తిలో ఏర్పాటు చేసిన ఓ బహిరంగ సభలో సభా వేదిక కూలిపోయింది. జగన్ రాక నేపథ్యంలో ఆయన్ని చూసేందుకు జనం భారీ ఎత్తున వేదికపైకి చేరుకోవడంతో వేదిక కూలిపోయినట్టు తెలుస్తోంది. అయితే అదృష్టవశాత్తుగా ఈ ఘటనలో ఎవ్వరికీ ఎటువంటి హాని జరగలేదని, వేదిక కూలిపోయిన సమయంలో జగన్ అక్కడ లేరని సమాచారం. 


కడప జిల్లా ఇడుపులపాయ నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు సుమారు 3000 కిలోమీటర్లు లక్ష్యంగా పెట్టుకుని నవంబర్ 6వ తేదిన ప్రారంభమైన వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర నేటితో 900 కిలో మీటర్లు పూర్తిచేసుకుంది. శ్రీకాళహస్తి నియోజకవర్గం చెర్లోపల్లి వద్ద తన పాదయాత్ర 900 కి.మీ పూర్తి చేసుకున్న సందర్భంగా జగన్ అక్కడ ఓ రావి మొక్కను నాటారు.